
Guru Purnima 2026
1. గురుభ్యోన్నమః
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకః
అజ్ఞాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః ||
(శ్రీ గురుగీత,శ్లో: 44)
భావం : “గు” అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ”రు” అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు.
అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురుకుల విద్యా విధానం అమలులో ఉన్నకాలం లో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలం లో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు.
గురు పూర్ణిమను పురస్కరించుకుని గురువులను స్మరించడం వలన త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది.
గురు పూర్ణిమ ఎందుకు జరుపుకుంటాం (Why Celebrate Guru Purnima)
ఆది యోగి, ఆదిగురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణమినాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తరువాత ఆయన ఇదేరోజున వేదాలను ఋక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.
గురుపూర్ణిమ ఎలా జరుపుకోవాలి (How to Celebrate Guru Purnima)
మనందరికీ ఆది గురువు ‘అమ్మ’ గురుపూర్ణిమనాడు ఓం ప్రథమంగా తల్లిని పూజించాలి. తండ్రిని, విద్యానేర్పించిన గురువులని కృతజ్ఞతగా పూజించాలి. మీ చేతనైన ఫలమో, వస్త్రమో ఇచ్చి ఆశీర్వచనాలను పొందాలి. ఈ రోజున దక్షిణా మూర్తిని, దత్తాత్రేయుని, హయగ్రీవుని, సాయి బాబావంటి యోగి పుంగవులనీ పూజించడం వలన సకల శుభాలూ ప్రాప్తిస్తాయి.
గురు పూర్ణిమ పూజా విధానం:
- ఉదయాన్నే లేచి శుచిగా ఉండాలి.
2. ఇంటి ఉత్తర దిశలో గురువు చిత్రం లేదా విగ్రహాన్ని ఉంచాలి.
3. గురువులకు పూలు, ప్రసాదం సమర్పించాలి.
4. గురు మంత్రాన్ని పఠించాలి:
గురుర్బ్రహ్మ గ్రుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥
5. హారతి ఇచ్చి, గురువులకు కృతజ్ఞతలు తెలియజేయాలి.
6. ఆశీర్వాదం పొందేందుకు గురువులను ప్రణమించాలి.
గురు పూర్ణిమ జ్యోతిష శాస్త్ర ప్రాముఖ్యత:
ఈ పండుగ ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పూర్ణిమ రోజున వస్తుంది. దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు చంద్రుడు ధనుస్సు రాశిలో ఉండి, పూర్వాషాఢ నక్షత్ర ప్రభావంతో ప్రకాశిస్తాడు. చంద్రుడు మనస్సుకు అధిపతి అయినందున, ఈ రోజు మనం గురువుల ఆశీర్వాదంతో మంచి మార్గంలో కొనసాగగలమని నమ్ముతారు.
గురు పూర్ణిమ రోజున పాటించవలసిన ఆచారాలు:
- విష్ణు సహస్రనామం పఠించడం.
- ఉపవాసం ఉండడం, మరికొంతమంది పండ్లు, పెరుగు తీసుకోవడం.
- దేవాలయ దర్శనం చేయడం.
- తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం.
- గురువులను ప్రత్యక్షంగా కలుసుకుని వారికి నైవేద్యం సమర్పించడం.
- ధ్యానం, యోగ సాధన చేయడం.
గురు పూర్ణిమతో ముడిపడి ఉన్న ఇతిహాసాలు:
బౌద్ధమతంలో కూడా గురు పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గౌతమ బుద్ధుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మ బోధన చేసిన రోజు ఇదే. ఈ శిష్యులు ఆయన మొదటి భిక్షువులు అయ్యారు. ఆ రోజు బుద్ధుడు ధమ్మచక్కప్పవత్తన సూత్రాన్ని బోధించారని చెప్పబడింది.
గురు పూర్ణిమ ప్రాముఖ్యత:
“గురు” అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవాడు అనే అర్థం ఉంది. గురువు జీవితానికి మార్గదర్శకుడు. శిష్యుడు తన జీవితంలో విజయం సాధించడానికి, శాస్త్రజ్ఞానాన్ని గ్రహించడానికి గురువు కీలక పాత్ర పోషిస్తాడు. అందుకే, ఈ రోజున గురువులను గౌరవించడం, వారి ఆశీస్సులు పొందడం మన సంప్రదాయంగా కొనసాగుతోంది.
ఈ పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారు. హిందువులు మాత్రమే కాకుండా బౌద్ధులు, జైనులు కూడా ఈ రోజును ఎంతో భక్తితో జరుపుకుంటారు. గురువు ఆశీర్వాదంతో మన జీవితంలో విజయం సాధించవచ్చని నమ్ముతారు. కాబట్టి, గురు పూర్ణిమ రోజున మనం మన గురువులకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుదాం!
Guru Purnima 2026 Date
గురు పూర్ణిమ (వ్యాస పూర్ణిమ) పండుగను జూలై 29, బుధవారం నాడు జరుపుకుంటారు.
- పౌర్ణమి తిథి ప్రారంభం: జూలై 28, 2026 (మంగళవారం) సాయంత్రం 06:18 గంటలకు
- పౌర్ణమి తిథి ముగింపు: జూలై 29, 2026 (బుధవారం) రాత్రి 08:05 గంటలకు
- గురు పూజ శుభ ముహూర్తం (ఉదయం): జూలై 29న ఉదయం 05:41 గంటల నుండి ఉదయం 09:05 గంటల వరకు
Related Posts
Sri Guru Paduka Stotram In Telugu | జగద్గురు ఆది శంకరాచార్య విరచిత గురుపాదుకా స్తోత్రం
గురుస్వరూపుడు సుబ్రహ్మణ్యుడు | Gurusvarupudu Subrahmanyudu in Telugu
Sri Guru Graha Stotram in Telugu | శ్రీ గురు స్తోత్రం, Sri Brihaspati Stotra
Sri Guru Paduka Stotram In Telugu | జగద్గురు ఆది శంకరాచార్య విరచిత గురుపాదుకా స్తోత్రం
పేదవాడి గురుదక్షిణ (ఈ రోజు కధ) | Story of Gurudakshina in Telugu
Sri Guru Raghavendra Story in Telugu | మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రుని చరిత్ర, మహిమలు, విశిష్టత








