శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం | Lord Krishna Greatness in Telugu

1
7789
krishna1
Lord Krishna Greatness

Lord Krishna Ideal

1శ్రీ కృష్ణుడు మనకు ఆదర్శం

ధర్మసంస్థాపనార్ధం భగవానుడైన శ్రీకృష్ణుడు, శ్రావణ బహుళ అష్టమి (గోకులాష్టమి) నాడు మధుర-కారాగారంలో జన్మించాడు. వచ్చే సమస్యలన్నింటినీ అవకాశాలుగా మార్చుకుని సమాజంలో సుఖశాంతులను నిర్మాణంచేశాడు. ఆ విధంగానే నేడు దేశంలో ఎదురవుతున్న వివిధ రకాల సమస్యలను చూచి, భయపడడం కాకుండా సమాజంలో సుఖ శాంతుల నిర్మాణం కోసం అందరూ పనిచేయాలి. 

కష్టాలు-సమస్యలు స్వీకరించాలనే మానసికతను కలిగి ఉండడం

  • శ్రీ కృష్ణుడు జైలు గోడల మధ్య జన్మించాడు.ఎనిమిది రోజుల లోపలనే ‘పూతన’ అనే రాక్షసిని సంహరించాడు. 8 సంవత్సరాల వయస్సులో అనేకమంది రాక్షసులను సంహరించడమే కాక లనేక సంస్కరణను సమాజంలో రూపొందించాడు.
    • ఉదా: ‘ఇంద్రునికి చేసిన పూజలు- కేవలం వ్యక్తిని గౌరవించినట్లు అవుతుందని, నిజ జీవన సహకారి అయిన గోవర్ధన గిరిని పూజించడం మాత్రమే సరియైనది అని నిరూపించాడు”.
  • స్త్రీలు బయలు ప్రదేశాలలో బట్టలు లేకుండా స్నానం చేయకూడదని పొన్చెట్టుపైకి చీరలు ఎత్తుకెళ్ళి గుణపాఠం నేర్పాడు.
  • కంసుని యొక్క రాజ్యానికి సహకారం అందకూడదని పాలు పెరుగు తీసుకొని వెళ్ళే గొల్లభామల తలలపై ఉండే కుండలను రాళ్ళతో చిల్లు కొట్టాడు.
  • బీదవారైన మిత్రులందరిని రాత్రిపూట వెంట తీసుకుని వెళ్లి సంపన్న కుటుంబాలలో వెన్నను తినిపించాడు.
  • ప్రక్కఉన్న రాక్షసకృత్యాల గమనాన్ని గుర్తించ కుండా నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలపడం కోసం రాత్రంతా చిలిపి చేష్టలతో సమాజాన్ని జాగృతం చేశాడు.
  • బాల్య మిత్రులందరిని చైతన్యవంతంగా ఆటలాడిస్తూ, వారందరిని సైనికులుగా మార్చాడు.
  • కాళీయ మర్దనం ద్వారా కాళీయోని అహంకారమును అణచడం మాత్రమే కాకుండా ప్రజలలో విశ్వాసం నిర్మాణం చేశాడు.
  • ఎనిమిది సంవత్సరాల వయస్సులోనే ఇంటింట తన ప్రేమ ప్రవాహాన్ని నింపగలిగాడు.

యోజనా బద్ధంగా రాక్షస కృత్యాలను అణచివేయడం

  • చాణూర-ముష్టికుల బలాన్ని తెలుసుకుని, వారి మర్మస్థలాలలో దెబ్బకొట్టి చంపాడు. ఆ కారణంగా కంసునిలో నిరాశను పెంచి అతనిని సంహరించాడు.
  • కంసుని బంధువులుగా ఉన్న జరాసంధుని సంతానాన్ని తన సైన్యంతో ఎదుర్కొన్నాడు. తల్లిదండ్రులను, తాత గారిని (దేవకీవసుదేవులు, ఉగ్రసేనుని) బంధవిముక్తులను చేసి రాజ్యపాలన అప్పగించాడు.
  • జరాసంధుడు చేస్తున్న దాడులను అనేకసార్లు త్రిప్పికొట్టి చివరికి, మధుర వాసులను కష్టాల నుండి రక్షించడం కోసం ద్వారకా నగరం నిర్మాణం చేశాడు.
  • అతిశక్తిమంతుడైన కాలయవనుడు వెంటబడిననప్పుడు ముచికుందుని గుహలోకి వెళ్ళి, ముచికుందుని ద్వారా రాక్షసుని చంపించాడు.
  • యుద్ధం నుండి పారిపోయినవాడు అనే అపనిందలు వచ్చినా ప్రజాసంక్షేమం కొరకు వాటిని భరించాడు.
  • శమంతకమణిని దొంగిలించాడని సత్రాజిత్తు మహారాజు తనపై వేసిన అపనిందను స్వీకరించి, అరణ్యంలో నివసిస్తున్న జాంబవతిని వివాహమాడాడు.
  • సత్యభామతో కలిసి, నరకాసురుని యుద్ధంలో సంహరింపజేసి, దీపావళి పండుగను సృష్టించాడు.

కర్మయోధులైన వారిని చేరదీసి, ధర్మసంస్థాపన చేయడం –

  • కౌరవుల చేత పీడింపబడుతున్న పాండవులను చేరదీసి మొదట వారికి కావలసిన సౌకర్యాలనన్నింటిని సమకూర్చాడు. . –
  • పెదతండ్రి ధృతరాష్ట్రుని మాట జవదాటలేక జూదమాడి సర్వస్వాన్ని పోగొట్టుకున్న నాడు పాండవుల వెంట ఉండి వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దాడు.
  • వ్యక్తిగత నియమం కన్నా సామాజిక నియమం మిన్న అని పాండవులకు బోధించి, ధర్మరాజుతో అబద్ధం ఆడించి ద్రోణుని చంపించాడు.
  • శిఖండిని విదురుగా నిలబెట్టి, భీష్ముని ఓడించాడు. కర్ణుని కవచకుండలాలను, ఇంద్రుని ద్వారా భిక్షమడిగించి కర్ణుని చావుకు కారకుడయ్యాడు.
  • కుంతి ద్వారా కర్ణునికి పాండవులందరు నీ సోదరులేనని తెలియజేయించి, నలుగురు పాండవులను (అరునుడు తప్ప) సంరక్షించాడు.
  • మోసంతో అతిగొప్ప సారథియైన శల్యుని కౌరవులు తన పక్షాన తీసుకొన్నపుడు ధర్మప్రబోధం చేసి శల్యసారథ్యం ద్వారా కర్ణుని నిర్వీర్యం చేశాడు.
  • గాంధారీ ద్వారా దుర్యోధనుని వజ్రశరీరునిగా మార్చడం కోసం ప్రయత్నం జరిగినప్పుడు-అర్ధరాత్రి పూట-బట్టలు లేని దుర్యోధనుని ప్రేరేపించి, అంగవస్త్రం కట్టింపజేసి, దుర్యోధనుని చావుకు కారణమయ్యాడు.

సమాజంలో అహంకారం తలెత్తకుండా మనస్సును దైవం వైపు మళ్ళించడం

  • రాజసూయ యాగంలో ఇంతగొప్ప అన్నదానం చేశామని అహంకరిస్తున్న పాండవులను సత్తుప్రస్థ మహారాజు గాథను-ముంగిస ద్వారా వినిపింపజేసి దైవీశక్తిని ప్రకటన చేశాడు.

సత్తుప్రస్థ మహారాజు గాథ

ఉపవాసాన్ని భరించలేక ఆకలితో అలమటిస్తూ సత్తుపిండి- నాలుగు ముద్దలను తినాలని సంసిద్దుడైన సత్తుప్రస్థ మహారాజు అతని భార్య, కుమారుడు, కూతురు వద్దకు ఒక అతిథి వచ్చి ఆహారం అడిగాడు.

అతనికి ఒక ముద్ద పెడతారు.

తర్వాత మరొక ముద్ద… నాలుగు ముద్దలు తినడానికి పెట్టాడు. ఆ అతిథి నాలుగు ముద్దలను తిని, తన వింగిలి చేతిని కడుగుతాడు. ఆ నీటిలో ఒక ముంగీస పొర్లా డితే దాని శరీర అర్ధభాగం బంగారంగా మారిపోతుంది. రాజసూయ యాగం సమయంలో ఆ ముంగీస ఎన్నిసార్లు పొర్లాడినా దాని శరీరం అర్ధభాగం బంగారు రంగులోకి మారిపోలేదు. తాను ఆకలితో అలమటిస్తూ, అతిథిని సత్కరించడం గొప్పది. భోగభాగ్యాలతో తులతూగుతూ అన్న సంతర్పణ చేయడం వేరు.

కురుక్షేత్ర యుద్ధానంతరం కురుక్షేత్రంలో అర్జునుని రథం దిగమని శ్రీకృష్ణుడు కోరగా అందుకు అర్జునుడు “సారధి ముందు దిగాలి. రథికుడు తర్వాత దిగాలి” అని అంటాడు. నేను ఆజ్ఞాపిస్తున్నానంటూ అర్జునుని రథం దింపేస్తాడు. శ్రీకృష్ణుడు దిగగానే వెంటనే రథం భగ్గున మండిపోతుంది. కారణం… భీష్మ, ద్రోణాది కురువీరులు ప్రయోగించిన అస్త్ర శస్తాలన్నింటిని శ్రీకృష్ణుడు, తన కాళ్ళతో రథం కింద తొక్కి పెట్టాడు. ముందు శ్రీకృష్ణుడు రథం దిగి ఉంటే అర్జునుడు భస్మమయ్యేవాడు. ఈ విధంగా అర్జునునికి కనువిప్ప కలిగిస్తాడు.

ధ్యేయం వైపు పురోగమించడం

అభిమన్యుని మరణానంతరం కృష్ణార్జునులు ధర్మరాజు వద్దకు వచ్చారు. అభిమన్యుని మరణ సమయంలో అర్జునుడు వెంట లేనందున విపరీతమైన కోపానికి గురైన ధర్మరాజు, అర్జునునితో “నీ గాంధీవం ఎందుకు? దీన్ని తగులబెట్టు” అంటాడు. అందుకు అర్జునుడు కత్తిదూసి ధర్మరాజును చంపడానికి సిద్ధమవుతాడు. అప్పడు ఎందుకు ఇలా చేస్తున్నావని శ్రీకృష్ణుడు, అర్జునుని అడిగితే “నా గాంధీవాన్ని నిందించిన వాడిని చంపేస్తానని శపథం చేశాను. ఆ విధంగా నేను ఇప్పుడు ధర్మరాజును చంపాలి” అని అన్నాడు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను సమైక్యంగా ఎదుర్కోవలసిన పాండవులలో ఈ స్థితి నిర్మాణం కావడం సరియైనది కాదని శ్రీకృష్ణుడు “పెద్దలను చంపాలంటే కత్తులు అవసరం లేదు. పెద్దలను దుర్భాషలాడితే చంపిన దానితో సమానం” అని తిట్టమంటాడు. అలా తిట్టిన తర్వాత అర్జునుడు కత్తి తీసుకొని తనను తాను చంపుకోవడానికి సిద్ధం అవుతాడు.

“ఇదేమి”టని ప్రశ్నించిన శ్రీకృష్ణునికి అర్జునుడు “మా అన్నగారైన యుధిష్టురుని ఎవరైనా నిందిస్తే వాళ్ళను చంపేస్తాను అని శపథం చేశాను. ఆ విధంగా నేను ఇప్పడు చనిపోవలసిందే” అని అంటాడు.

అప్పుడు శ్రీకృష్ణుడు “తనను తాను పొగడుకోవడం (ఆత్మస్తుతి) ఆత్మహత్యతో సమానం. కనుక నిన్ను నీవు పొగడుకుంటే చనిపోయినట్లే”నని ధర్మసూక్ష్మాన్ని తెలిపి, కాబోతున్న యుద్ధం ధర్మసంస్ధాపనకు ఆధారం. అందులో విజయం పొందాలనే వానికి మధ్యలో చిన్న చిన్న విషయాలు ఆధారం చేసుకొని, ముఖ్యమైన ధ్యేయం దుర్బలం కారాదని సెలవిచ్చాడు.

కార్యక్షేత్ర సర్వేక్షణ

తాను తీసుకున్న ధ్యేయపూర్తికి అనుకూల వర్గాలను, ప్రతికూల వర్గాలను తెలుసుకొని వ్యవహరించడం. గుణ దోషాలను తెలుసుకోవడం.

దుర్యోధనుడు శ్రీకృష్ణుని విందుకు ఆహ్వానించినప్పుడు, విందును నిరాకరించి విదురుని ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు.

“అధికారం, ధనం, సైన్యం కన్నా ధర్మం, సత్యం, శీలం, ధర్మసంస్థాపనకు ఆధారం అవుతాయి” అని తెలిపాడు.

నిర్విరామ కృషి

ధ్యేయం వైపు పురోగమిస్తున్న కార్యకర్త నిరంతరం సక్రమంగా-ఉండవలసిన అవసరం ఉంది.

ఉదా: బర్బరీకుడు ఘటోత్కచుని కుమారుడు. శ్రీకృష్ణునికి ఎదురుపడగా “ఎక్కడికి వెళ్ళుతున్నావ”ని బర్బరీకుని అడుగుతాడు.

“మహాభారతయుద్ధంలో ఎవరు ఓడిపోతారో వారి పక్షాననిలచి గెలిపించడానికి వెళుతున్నానని” సమాధానమిస్తాడు.

నీ మహిమ చూపించుమని శ్రీకృష్ణుడనగా “మరిచెట్టుపైకి బాణం వదులుతాడు ఆ బాణం చెట్టులో ఉన్న మరిఆకులన్నింటిని ఛేదించుకుంటూ బయటకి వెళ్ళుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఒక ఆకుని తీసుకొని, తన కాలు క్రింద పెట్టుకుంటాడు. కాలు క్రిందున్న ఆకును కూడా బాణం ఛేదించుకుని వెళ్ళిపోతుంది.

అప్పుడు శ్రీకృష్ణుడు వీడు బ్రతికితే కౌరవులకు విజయం లభిస్తుందని చక్రంతో వాని తల నరికివేస్తాడు. యుద్ధం చూడాలనే బర్బరీకుని కోరికతో నరికిన తలను కొండపై ఉంచగా, యుద్ధాన్ని చూస్తుంటాడు.

పాండవులకు యుద్ధంలో తమ కౌశలత్వంతో గెలిచామనే అహంకారంతో యుద్ధవిజయానికి కారణాన్ని శ్రీకృష్ణుని అడుగుతారు. శ్రీకృష్ణుడు పాండవులను బర్బరీకుని వద్దకు వెళ్ళి అడగమంటాడు. బర్బరీకుడు పాండవులతో “యుద్ధంలో అస్త్ర శస్తాలుగాని, ఇంకేమి కనబడలేదు. కేవలం సుదర్శన చక్రమే తిరుగుతూ మీ అందరిని కాపాడింది” అంటాడు. శ్రీకృష్ణుడు సారథ్యం చేస్తూనే, యుద్ధభూమిలో జరుగుతున్న వాటినన్నింటిని గమనిస్తూ, తగిన సహకారం అందించాడు. ధ్యేయసాధనలో తన శక్తిని ప్రదర్శించాలి కాని ఇతరులను పోల్చుకోరాదు.

ధర్మం కొరకే జీవించాలని కోరుకున్న పాండవులు నిరాశకు గురై, నిష్క్రీయంగా ఉన్నవాళ్ళ నందరిని క్రియాశీలు రుగా మార్చడం శ్రీకృష్ణుని ప్రతిభ.

కుంతి, పాండవులు అజ్ఞాతంలో ఉన్న సమయంలో ద్రౌపది స్వయంవరంలో పాల్గొనేలా చేసి మరోసారి వారిలో మనో బలాన్ని నింపాడు.

దుర్యోధనుడు-1000 మంది శిష్యులతో సహ దుర్వాసుని అరణ్యంలో ఉన్న పాండవుల వద్దకు అతిథులుగా పంపిస్తాడు. ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్న ద్రౌపదికి, ఆమె వద్ద ఉన్న అక్షయపాత్రలో మెతుకును సృష్టించి, తాను భుజించి భోజనానికి బయలుదేరుతున్న దుర్వాస శిష్యులకు విందుభోజనంతో పొట్టనిండేలా చేసి, దుర్వాసుని శాపం నుండి వారందరిని కాపాడి మనోబలం పెంచుతాడు.

ఇలా ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణభగవానుడు చేసిన ఉద్యమం మహత్తరమైనది.ప్రతివారూ శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకొని, వారి అడుగు జాడలలో ధర్మసంస్థాపనకు సంసిద్ధం కావాలి.

Related Posts

ఈ రాశుల వారిపై శ్రీకృష్ణుని ప్రత్యేకమైన కటాక్షం! Lord Sri Krishna Special Blessings on These Zodiac Signs

What to Buy on Janmashtami 2025 | జన్మాష్టమి రోజున ఈ వస్తువులు కొని శ్రీకృష్ణున్ని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు?

శ్రీ కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు | Lord Krishna History & Secretes

Shri Krishna Janmashtami Vrat Vidhi | శ్రీ కృష్ణాష్టమీ వ్రతం ఎలా చేయాలి?

Krishna janmashtami 2025 | శ్రీ కృష్ణ జన్మాష్టమి విశిష్టత & పూజా విధానం

1 COMMENT

  1. Eexellent message. Thaylisina message yea aieana chadhuvuthuntay eanka chala vishayalu aa sreekrishna parmathma gurinchi thaylusukovalani undhi.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here