lord-krishna-hariome
ఈ రోజు – శ్రీ కృష్ణాష్టమీ ? వ్రతం ఎలా చేయాలి? | Shri Krishna Janmashtami Vrat Vidhi

sri krishnashtami

శ్రావణ మాసంలోని బహుళ అష్టమి – శ్రీకృష్ణాష్టమి, శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజు. దీనికే శ్రీకృష్ణ జన్మాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి అని కూడా పేర్లు.

అటువంటి శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణ భగవానుడిని పూజించడమే కాకుండా శ్రీకృష్ణాష్టమీ వ్రతాన్ని ఆచరించాలని శాస్త్రవచనం.

శ్రీకృష్ణాష్టమీ వ్రతాన్ని గురించిన ప్రస్తావన బ్రహ్మాండపురాణం, స్కాందపురాణం, బ్రహ్మవైవర్తపురాణం, మార్కండేయ పురాణాలలో కనిపిస్తుంది.

పూర్వం నారదమహర్షి ఒకసారి సత్యలోకమునకు చేరుకుని బ్రహ్మదేవుడిని దర్శించి- “స్వామీ! నా మీద దయఉంచి శ్రీకృష్ణాష్టమి మాహాత్మ్యమును గురించి వివరించండి” అని కోరాడు.

“నారదా! శ్రీకృష్ణుడు జన్మించిన రోజు అత్యంత పవిత్రమైన రోజు. ఈనాడు శ్రీకృష్ణాష్టమి పేరు స్మరించినంతనే జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలై, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి.

అటువంటి కృష్ణాష్టమినాడు శ్రీకృష్ణాష్టమి ప్రతాన్ని ఆచరించాలి. ఈనాడు పగలంతా ఉపవాసం ఉండి శ్రీకృష్ణుడిని స్మరిస్తూ గడిపి రాత్రి వ్రతం చేయాలి.

పూర్వం అంబరీషుడు, శిశుపాలుడు, గాధిమహా రాజు వంటివారు ఈ వ్రతాన్ని ఆచరించి గొప్పవారయ్యారు. ఎందరో మహామునులు ఈ ప్రతాన్ని ఆచరించి మరణానంతరం విష్ణులోకమును పొందారు.

ఈ వ్రతాచరణ వల్ల సకల భయాలు తొలగిపోయి, వ్యాధులన్నీ నయమై, సకల సంపదలు, అష్టేశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఆయుష్ను వృద్ధి చెందడం తోపాటూ విద్యా విజ్ఞానము వృద్ధి చెందుతాయి” అని బ్రహ్మదేవుడు వివరించాడు.

ఈ విధంగా బ్రహ్మదేవుడి వద్ద నుంచి శ్రీకృష్ణాష్టమీ వ్రతాన్ని తెలుసుకున్న త్రిలోకసంచారి అయిన నారద మహర్షి సకల లోకవాసులకూ దీనిని గురించి వివరించడంతో ఆచరణలోనికి వచ్చినట్లు పురాణ కథనం.

శ్రీకృష్ణాష్టమి ముందురోజు రాత్రి ఉపవాసం ఉండి పవిత్రంగా గడపాలి.

శ్రీకృష్ణాష్టమి రోజు తెల్లవారు ఝామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చు కుని, నువ్వులపిండిని శరీరానికి, ఉసిరిక ఒడియం పిండిని తలకు రుద్దుకుని, తులసీదళములతో కూడిన నీటితో స్నానమాచరించాలి.

ఇంటిని శుభ్రపరచి, అలికి, ముగ్గులను పెట్టుకొనడంతో పాటూ ఇంటిగడపను శుభ్ర పరచి. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొనవలెను.

కొందరు చిన్న చిన్న పాదముల గుర్తులను ఇంటిలోనికి వస్తున్నట్లు చిత్రీకరిస్తారు. చిన్ని కృష్ణుడు ఇంటిలోనికి వచ్చినందులకు చిహ్నంగా భావిస్తారు.

తర్వాత ఆచమనం చేసి ఉపవాసం ఉండి వ్రతం చేస్తున్నట్లుగా సంకల్పించాలి. శ్రీకృష్ణుడిని పూజించాలి.

పగలంతా ఉపవాసం ఉండడం వల్ల సప్తజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అగ్నిపురాణం చెబుతుండగా, వెయ్యిగోవులను దానం చేసిన ఫలం కలుగుతుందనీ, లక్షల కొద్దీ బంగారు నాణెములు, ఆభరణాలను కురుక్షేత్రంలో పండితులకు దానం యిచ్చిన ఫలం కలుగుతుందని బ్రహ్మ దేవుడు చెప్పినట్లు పురాణకథనం.

తర్వాత శ్రీమద్బాగవతం దశమస్కందంలోని శ్రీకృష్ణ జననం, బాల్య క్రీడలు వంటి వాటిని చదవడం గానీ, వింటూ గడపడం గానీ చేయాలి.

తిరిగి సాయంకాలం స్నానమాచరించి వ్రతం చేయాలి. ఇంటిలోని పూజామందిరంలోగానీ, ఇంటిలో వ్రతం చేయదలచిన చోట ఏర్పాటు చేసుకున్న పూజాపీఠంపై బియ్యపు పిండితో ముగ్గులు వేయవలెను.

పీఠం మధ్యభాగంలో బియ్యం పోసి… బియ్యంపైన కలశమును ఏర్పాటు చేసుకోవాలి. కలశం ముందు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కానీ, వెనుక వైపున చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకొనవలెను.

కలశమును ప్రతిష్టించుకునే ఆచారం లేనివారు శ్రీకృష్ణుడి విగ్రహమును గానీ, చిత్రపటాన్ని గానీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇనుము, కత్తి, నీరు, గుమ్మడిపండు, పోకపండు, కరక్కాయ, మారేడుపండు, దానిమ్మపండు, జాజిపండు, కొబ్బరిపండు, జింజీరఫలం వంటివాటిల్లో ఏవైనా ఎనిమిదింటిని మండపమునందు ఉంచవలెనని శాస్త్రవచనం.

ఈ విధంగా స్వామివారిని ఏర్పాటుచేసుకున్న అనంతరం ముందుగా గణపతిని పూజించాలి.

తర్వాత శ్రీకృష్ణుడిని షోడశోపచారాలు, అష్ణోత్తరాలతో పూజించాలి. పాలు, మీగడ, పెరుగు, వెన్న నెయ్యి, చక్కెర కలిపి చేసిన కాయం లతో పాటూ శక్తిమేరకు పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి.

అనంతరం వ్రత కథ ను చదివి అక్షతలు వేసి నమస్కరించాలి. తర్వాత-

పాహిమాం సర్వలోకేశ హరే సంసారసాగరాత్

త్రాహిమాం సర్వపాపఘ్న దుఃఖశోకార్డవాత్ ప్రభో!!

సర్వలోకేశ్వర త్రాహి పతితం మాం భవార్ణవే

త్రాహిమాం దేవ దేవేశ త్వత్తో నాన్యోస్తి రక్షకః!!

యద్వాక్వచన కౌమారే యౌవనే యచ్చ వార్థకే!

తత్పుణ్యం వృద్ధిమాయాతు పాపం దహ హలాయుధ!!

 

అనే శ్లోకాన్ని పఠించి నమస్కరించాలి.

ఇలా వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి భోజనం చేయాలి. మరుసటి రోజు తిరిగి స్వామి వారిని పూజించి ప్రతాన్ని ముగించాలి. ఈ విధంగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమినాడు వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీకృష్ణభగవానుడి కరుణాకటాక్షాలు లభిస్తాయి. –

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ

నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః.

—చంద్రశేఖర్ రావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here