Makar Sankranti in Telugu | పుణ్యాల పండుగ – మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది?

0
3850
Sankranti
పుణ్యాల పండుగ – సంక్రాంతి | Makar Sankranti in Telugu

Makara Sankranti 2025

1సంక్రాంతి పండుగ

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

సంక్రాంతి పండుగను ఎందుకు చేసుకుంటాం?(Why We Celebrate Sankranti?)

పుణ్య పర్వం సంక్రాంతి. ఏ కర్మల వలన మనం పవిత్రులవుతామో వాటిని పుణ్యాలు అంటారు. అలాంటి సత్కర్మలకు సత్కాలం లభించడం యోగం. వర్షఋతువులో వ్యవసాయం వలె – పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు యోగ్యమై విశేష ఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.

సూర్యశక్తిలోని దివ్యత్వాన్ని దర్శించిన మహర్షులు, దాన్ని పొందే పద్ధతులను ధార్మిక గ్రంథాల ద్వారా అందించారు. సౌరకాంతి పరివర్తనాన్ని ఆధారం చేసుకున్న పర్వం సంక్రాంతి.

ఏమాసమైనా సంక్రమణం దివ్యపర్వమే. అయినా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమైన మకర సంక్రమణానికి విశిష్ట ప్రాధాన్యముందని శాస్త్రోక్తి.

స్నాన దాన జపతపాది పుణ్యర్మలు ఈ పర్వకాలంలో పుష్టినిస్తాయని, సత్సంకల్పాలు అవశ్యం ఫలిస్తాయని ఆర్షగ్రంథాల మాట.

దేవతలను, పితృదేవతలను పూజలతో, తర్పణలతో తృప్తిపరచి వారి అనుగ్రహం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సర్వసంపత్సమృద్ధిని పొందడానికి ఈ పర్వం మహోపయోగమని ధర్మశాస్త్రకర్తల వచనం.

ఈ సంక్రాంతిని ’తిల సంక్రాంతి’ అనీ వ్యవహరిస్తారు. సంక్రాంతికున్న వివిధ విశిష్టాంశాలలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అంశాన్ని పాటిస్తుంది.

దేవతలకు (ప్రత్యేకంగా శివుడికి) నువ్వులనూనె దీపాన్ని అర్పించడం, నువ్వులతో వండిన వంటకాలను నివేదించి, ఆ ప్రసాదాలను ఆరగించడం శ్రేష్ఠమని అనుష్ఠాన ప్రధాన గ్రంధాలు చెబుతున్న విశేషం.

తిలలను, బెల్లపు పదార్థాలను కలిపి ఒకరికొకరు అందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం కొన్నిప్రాంతాల ఆచారం.

కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యభగవానుడికి నివేదించడం వేదాల యజ్ఞాల్లోని అంశం. ఆ వేదసంస్కృతి సామాన్యుల్లోనూ వ్యాప్తమై ’పొంగల్’ పేరుతో జరుగుతోంది. దీనికి మూలం- వైదికమైన ’ఆగ్రయణేష్టి’.

మంచికాలంలో మంచి ఆలోచన, మంచి ఆచరణ – అనే ఒక మంగళకర భావన ఈ పర్వంలో వ్యాపించి ఉంది.

సూక్ష్మ దివ్య విజ్ఞానానికి సంబంధించిన అంశాలతో పాటు, అన్ని భారతీయ పర్వాల్లాగా ఈ పర్వంలోనూ ప్రకృతితో మానవుడికున్న ఆత్మీయబంధం గోచరిస్తుంది. ప్రాణదాత్రి అయిన సౌరశక్తిలోని పరిణామాల్లో దివ్యత్వాన్ని దర్శించడం గొప్ప సంస్కారం.

ప్రకృతిలో జీవనగతిపై ప్రభావం చూపే పంచభూతాలు, గ్రహాల రీతులను గమనించి ఒకదానితో ఒకటి అనుబంధమై, ఒకదానిపై ఒకటి స్పందనను ప్రసరిస్తున్న విశ్వరహస్యాలను గ్రహించి – ఋషులు కొన్ని పద్ధతులను నిర్దేశించారు.

ప్రకృతి పరిణామాల పట్ల, మానవ సంబంధాల పట్ల ఒక చైతన్యవంతమైన ఆత్మీయతను చాటిచెప్పే పండుగలివి- అని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే స్పష్టపడుతుంది.

ప్రతి ఇల్లూ లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ, బంధుమిత్రులతో కళకళలాడటం సంక్రాంతి శోభ. సామాజికంగా ఉన్న సమైక్యతకు ఈ పర్వం ఒక తార్కాణం. ’దానం’ద్వారా అభ్యుదయం సాధించాలని చాటిన ధర్మశాస్త్రాలు, ఈ పండుగను ’దానపర్వం’గా అభివర్ణించాయి. ఈ సంక్రాంతినాడు స్యలక్ష్మీ కళను ఆరాధించడం, వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అవశ్యకర్తవ్యంగా భావిస్తారు. ఈ పంటల పండుగనాడు మహాలక్ష్మిని ఆరాధించడం శ్రేష్ఠమని దేవీ మహిమా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పౌష్యలక్ష్మి, సంక్రాంతి లక్ష్మి – అని కీర్తించే జగజ్జననిని రంగవల్లులతో, పసుపు కుంకుమలతో, నవధాన్యంతో ఆరాధించడం సంప్రదాయం.

కొన్ని ప్రాంతాల్లో ముత్తయిదువులు పసుపు కుంకాలను పంచుకుంటూ సౌభాగ్య కాంక్షను వ్యక్తపరచడం సంప్రదాయంగా ఉంది. దివ్యత్వ మానవత్వాలతో ప్రకృతి సౌందర్యం పరిమళించడం సంక్రమణ సంపద.

-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

మకర సంక్రాంతి 2025 తేదీ (Makar Sankranti 2025 Date)

2025లో మకర సంక్రాంతి తేదీ – జనవరి 14, 2025, మంగళవారం

మకర సంక్రాంతి పుణ్యకాలం – 09:03 AM నుండి 05:46 PM వరకు

వ్యవధి – 08 గంటల 42 నిమిషాలు

మకర సంక్రాంతి మహా పుణ్య కాలం – 09:03 AM నుండి 10:48 AM వరకు

వ్యవధి – 01 గంట 45 నిమిషాలు

మకర సంక్రాంతి క్షణం – 09:03 AM

Related Posts

Bhogi Pallu Significance | బోగి పండ్ల పరమార్థం ఏమిటంటే.?

భోగాల పంట భోగి మంట | Bhogi Festival in Telugu

జ్యోతిష్యశాస్త్రరీత్యా జీవన క్రాంతి సంక్రాంతి | Spiritual Significance of Makar Sankranti

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

Why Should we Worship Bulls on Sankranti in Telugu? | సంక్రాంతికి ఎదుల్ని ఎందుకు పూజించాలి?

https://hariome.com/kanuma-festival-2022/

సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

Darsha Amavasya 2024 Dates, Significance, Rituals, Puja Vidhi & Vrat Katha | దర్శ అమావాస్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here