భోగిమంట…భోగాల పంట (రేపు భోగి పండుగ) | Bhogi Festival in Telugu

1
5331
భోగిమంట…భోగాల పంట (రేపు భోగి పండుగ) | Bhogi Festival in Telugu

bhogi festival

మనిషి ఆలోచనలను గ్రహించడానికి మాట ఎలాగో, ఒక జాతి ఆలోచనలను, ఆచారాలను గ్రహించడానికి పండుగలు అలాగ! ఏ ప్రాంతంలో అయినా, పండుగలను జరుపుకొనే తీరు పరిశీలిస్తే- ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆ ప్రాంత ప్రజల అలవాట్లు కట్టుబాట్లు తెలుస్తాయి.

కనుకనే పండుగలను జాతి జీవనాడికి కొలమానాలుగా చెబుతారు. వాటిని సంస్కృతిలో భాగంగా పరిగణిస్తారు. పండుగలనాటి జనజీవన వ్యవహారశైలిని రూపొందించిన మన పెద్దల దృష్టిలో ప్రాణికోటి అంటే మానవులొక్కరే కాదు- జంతువులు, వృక్షాలతో సహా సృష్టిలోని జీవజాలం మొత్తాన్ని వారు ప్రాణికోటిగా పరిగణించారు. ఆచార వ్యవహారాల్లో వాటికి భాగం పంచారు.

పశువులూ పక్షులూ మానవ పరివారంలో భాగమేనన్నది పండుగల ద్వారా మనపెద్దలు అందించిన సందేశం. సంక్రాంతి పండుగ దానికి చక్కని ఉదాహరణ. సంక్రాంతి అనే మాటకు చేరువ కావడం అని అర్థం. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి చేరడాన్ని సంక్రాంతిగా పరిగణిస్తారు. పండుగలనేవి మనుషుల్ని కలపడానికే పుట్టాయి. సంక్రాంతి రోజుల్లో మన విధులను పరిశీలిస్తే ప్రకృతితో లయకలిపి జీవించడమే సంక్రాంతి అనే మాటకు అసలు అర్థంగా తోస్తుంది.

మూడు రోజుల పెద్దపండుగలో మొదటిది భోగి పండుగ. ధనుర్మాసానికి ముగింపు అది. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి శ్రీరంగనాథుడి పత్నిగా సౌభాగ్యానికి నోచుకున్న దానికి సంకేతమే భోగి. పాతసామాన్లు, చీపుళ్లు, ఎండుకొమ్మలు, విరిగిన వస్తువులు లాంటి మానవ దారిద్య్ర చిహ్నాలను మంటల్లో తగలబెట్టడం ఆనాటి ఆచారం. లేమి చీకట్లలోంచి భోగవికాసాల్లోకి దారిచూపే ఆ మంటల్ని భోగిమంటలన్నారు. మర్నాటి నుంచి ఆరంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాలాన్ని మనిషి ఉత్సాహంగా ఆహ్వానించడానికి అవి చిహ్నాలు. పండిన పంటలు చేతికి అందే ఆనందపు రోజులవి. తెల్లగా వెల్లలు పూసిన గాదెలు నిండు ధాన్యపు రాశులతో కళకళలాడే సమయం అది. వాటిని గరిసెల్లో గాదెల్లో నింపడానికి ముందే గ్రామీణులు తమ ఇళ్లచూరులకు, దేవాలయ ప్రాంగణాల్లోను కొత్త ధాన్యపు కంకుల్ని కుచ్చులుగా కట్టి వేలాడదీస్తారు. చూడటానికి అవి వడ్ల కిరీటాల్లా ఉంటాయి. పిచుకలనూ, పిట్టలనూ అవి ఆహ్వానిస్తాయి. మందలు మందలుగా చేరిన పక్షుల బృందగానాల రొదతో కొత్త సున్నాలు వేసిన రైతుల ఇళ్లు చిలకలు వాలిన చెట్లు అయిపోతాయి. ఇంటికి పండుగ వాతావరణాన్ని ఆపాదించడంలో ఆ సందడి చాలా ముఖ్యమైనది. పిల్లల కేకలు, పక్షుల అరుపులు లేకుండా నిశ్శబ్దంగా ఉసూరుమంటూ ఉండే ఇంటికి పండుగ శోభ రమ్మన్నా రాదు. ఇంటి ముంగిట ముగ్గుల్లోని గుల్లసున్నం ఘాటు, గుమ్మాలకు పూసిన పసుపు కుంకుమల వింత పరిమళాలను కలుపుకొని ఇల్లంతా చక్కగా వ్యాపించిందంటే పెద్దపండుగ వచ్చేసిందని అర్థం.

భోగి పండుగ

ఇంతలో తంబురమీటుతూ, ‘హరిలో రంగ హరి’ వినిపిస్తూ (వైష్ణవం) హరిదాసులు, ‘శంభో’ అని పెద్దధ్వనితో శంఖం పూరిస్తూ (శైవం) జంగందేవరలు, ‘అంబ పల్కు జగదంబ పల్కులను వినిపించే బుడబుక్కల వాళ్లూ, ‘అయ్యగారికి దండం అమ్మగారికి దండం’ అంటూ గంగిరెద్దుల విన్యాసాలు పండుగకు శోభ చేకూరుస్తాయి. సంపదల సమృద్ధితో సంతోషంగా ఉన్న గృహస్థులు వారిని సత్కరిస్తారు.

భోగినాటి ఆకర్షణల్లో గొబ్బెమ్మల పూజ ప్రధానమైనది. భాగవతంలోని కాత్యాయనీ వ్రతమే దీనికి పునాది. కన్యలు వేకువనే లేచి, వాకిట రంగవల్లులు తీర్చి.

ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను మధ్యలో ఉంచి, గుమ్మడి పూలతో అలంకరించి, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేసే దృశ్యం చూస్తే పండుగంటే ఇదేసుమా అనిపిస్తుంది.

పట్టు పరికిణీలు, వెండిమువ్వల కేరింతలు… భోగి కళ కన్నుల పండుగ! ‘సుబ్బీ సుబ్బమ్మ! శుభములీయవె, తామర పూవంటి తమ్ముణ్నీయవె, చేమంతి పూవంటి చెల్లెలినీయవె’ అంటూ కన్నెపిల్లలు గొబ్బెమ్మల రూపంలోని గౌరీదేవిని ఆరాధిస్తారు.

ఈ పాటలోని నిజమైన ఆంతర్యం చివరి పంక్తిలో ఉంది. ‘మొగలి పువ్వంటి మొగుణ్ని ఈయవే’- అనేదే అసలైన ప్రార్థన. భార్య సంపెంగ పూవులాను, మొగుడు మొగలిపూవులాను ఉండాలనుకోవడంలో చక్కని చమత్కారం ఉంది. సంపెంగలపై తుమ్మెదలు వాలవు.

మొగలిపూవు శివార్చనకు పనికిరాదు. ‘నా మనిషి నాకే సొంతం’ తరహా గడుసు అంతరార్థం కారణంగా ఈ పాట తరతరాలుగా నిలిచింది. ఇక తల్లిహోదా పొందిన ఇల్లాళ్లకు ఈరోజు చేతినిండా పని.

పదిమందినీ పిలిచి పేరంటం చేసి, తమ పిల్లల నెత్తిన రేగుపళ్లు కొబ్బరిముక్కలు పచ్చిశెనగలు నాణాలు కలిపిన భోగిపళ్ల సంబరాలతో హారతులు ఆశీస్సులు ఇప్పిస్తారు.

భోగినాడు ఇంద్రుడికి పొంగలి నైవేద్యం ఆనవాయితీ. రాబోయే వేసవితాపాన్ని తగ్గించి, తొలకరినీ, సకాల, సంపూర్ణ వర్షాలతో పంటలను బాగా అనుగ్రహించాలన్న ప్రార్థనలతో ‘ఇంద్ర పొంగలి’ నివేదిస్తారు.

మొత్తంమీద పెద్దాచిన్నా, ఆడామగ, పిల్లామేకా, పక్షీపశువూ, చెట్టుచేమా… మొత్తం మానవ పరివారానికి చెందిన పూర్తిస్థాయి పండుగ ఇది. అందుకే ఇది పెద్దపండుగ!

– ఎర్రాప్రగడ రామకృష్ణ

1 COMMENT

  1. పండుగ అంటే కేవలం క్రొత్తబట్టలు, పిండివంటలు అనుకునే ఈ తరానికి తెలియని పండుగ ముఖ్యోద్దేశం గురించి చాలా చక్కగా చెప్పారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here