పుణ్యాల పండుగ – సంక్రాంతి | Makar Sankranti in Telugu

0
3149
Sankranti 2020
పుణ్యాల పండుగ – సంక్రాంతి | Makar Sankranti in Telugu

Sankranti 2020

పుణ్య పర్వం సంక్రాంతి. ఏ కర్మల వలన మనం పవిత్రులవుతామో వాటిని పుణ్యాలు అంటారు. అలాంటి సత్కర్మలకు సత్కాలం లభించడం యోగం. వర్షఋతువులో వ్యవసాయం వలె – పుణ్యకాలాల్లో పుణ్యకర్మలు యోగ్యమై విశేష ఫలాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.

సూర్యశక్తిలోని దివ్యత్వాన్ని దర్శించిన మహర్షులు, దాన్ని పొందే పద్ధతులను ధార్మిక గ్రంథాల ద్వారా అందించారు. సౌరకాంతి పరివర్తనాన్ని ఆధారం చేసుకున్న పర్వం సంక్రాంతి.

ఏమాసమైనా సంక్రమణం దివ్యపర్వమే. అయినా, ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమైన మకర సంక్రమణానికి విశిష్ట ప్రాధాన్యముందని శాస్త్రోక్తి.

స్నాన దాన జపతపాది పుణ్యర్మలు ఈ పర్వకాలంలో పుష్టినిస్తాయని, సత్సంకల్పాలు అవశ్యం ఫలిస్తాయని ఆర్షగ్రంథాల మాట.

దేవతలను, పితృదేవతలను పూజలతో, తర్పణలతో తృప్తిపరచి వారి అనుగ్రహం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, సర్వసంపత్సమృద్ధిని పొందడానికి ఈ పర్వం మహోపయోగమని ధర్మశాస్త్రకర్తల వచనం.

ఈ సంక్రాంతిని ’తిల సంక్రాంతి’ అనీ వ్యవహరిస్తారు. సంక్రాంతికున్న వివిధ విశిష్టాంశాలలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క అంశాన్ని పాటిస్తుంది.

దేవతలకు (ప్రత్యేకంగా శివుడికి) నువ్వులనూనె దీపాన్ని అర్పించడం, నువ్వులతో వండిన వంటకాలను నివేదించి, ఆ ప్రసాదాలను ఆరగించడం శ్రేష్ఠమని అనుష్ఠాన ప్రధాన గ్రంధాలు చెబుతున్న విశేషం.

తిలలను, బెల్లపు పదార్థాలను కలిపి ఒకరికొకరు అందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం కొన్నిప్రాంతాల ఆచారం.

కొత్తబియ్యంతో పాయసం వండి సూర్యభగవానుడికి నివేదించడం వేదాల యజ్ఞాల్లోని అంశం. ఆ వేదసంస్కృతి సామాన్యుల్లోనూ వ్యాప్తమై ’పొంగల్’ పేరుతో జరుగుతోంది. దీనికి మూలం- వైదికమైన ’ఆగ్రయణేష్టి’.

మంచికాలంలో మంచి ఆలోచన, మంచి ఆచరణ – అనే ఒక మంగళకర భావన ఈ పర్వంలో వ్యాపించి ఉంది.

సూక్ష్మ దివ్య విజ్ఞానానికి సంబంధించిన అంశాలతో పాటు, అన్ని భారతీయ పర్వాల్లాగా ఈ పర్వంలోనూ ప్రకృతితో మానవుడికున్న ఆత్మీయబంధం గోచరిస్తుంది. ప్రాణదాత్రి అయిన సౌరశక్తిలోని పరిణామాల్లో దివ్యత్వాన్ని దర్శించడం గొప్ప సంస్కారం.

ప్రకృతిలో జీవనగతిపై ప్రభావం చూపే పంచభూతాలు, గ్రహాల రీతులను గమనించి ఒకదానితో ఒకటి అనుబంధమై, ఒకదానిపై ఒకటి స్పందనను ప్రసరిస్తున్న విశ్వరహస్యాలను గ్రహించి – ఋషులు కొన్ని పద్ధతులను నిర్దేశించారు.

ప్రకృతి పరిణామాల పట్ల, మానవ సంబంధాల పట్ల ఒక చైతన్యవంతమైన ఆత్మీయతను చాటిచెప్పే పండుగలివి- అని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తే స్పష్టపడుతుంది.

ప్రతి ఇల్లూ లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ, బంధుమిత్రులతో కళకళలాడటం సంక్రాంతి శోభ. సామాజికంగా ఉన్న సమైక్యతకు ఈ పర్వం ఒక తార్కాణం. ’దానం’ద్వారా అభ్యుదయం సాధించాలని చాటిన ధర్మశాస్త్రాలు, ఈ పండుగను ’దానపర్వం’గా అభివర్ణించాయి. ఈ సంక్రాంతినాడు స్యలక్ష్మీ కళను ఆరాధించడం, వ్యవసాయ ప్రధానమైన మనదేశంలో అవశ్యకర్తవ్యంగా భావిస్తారు. ఈ పంటల పండుగనాడు మహాలక్ష్మిని ఆరాధించడం శ్రేష్ఠమని దేవీ మహిమా గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పౌష్యలక్ష్మి, సంక్రాంతి లక్ష్మి – అని కీర్తించే జగజ్జననిని రంగవల్లులతో, పసుపు కుంకుమలతో, నవధాన్యంతో ఆరాధించడం సంప్రదాయం.

కొన్ని ప్రాంతాల్లో ముత్తయిదువులు పసుపు కుంకాలను పంచుకుంటూ సౌభాగ్య కాంక్షను వ్యక్తపరచడం సంప్రదాయంగా ఉంది. దివ్యత్వ మానవత్వాలతో ప్రకృతి సౌందర్యం పరిమళించడం సంక్రమణ సంపద.

పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here