
Valmiki Jayanti
7-10-2025 : వాల్మీకి మహర్షి జయంతి
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించి, వారిని తలంచుకుని, నమస్కరించుకుని, వారు రచించిన మహా గ్రంథములలో ఒక శ్లోకం స్మరణ చేసుకుందాం.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ, అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు.
నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. రామ అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు మరా అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపంచేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగకు ఆపాదిస్తాడు.వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
పురాణాల్లో వాల్మీకి మహర్షి ప్రస్తావన:
మహర్షి వాల్మీకి జీవిత గాథ రామాయణంలో కూడా ప్రస్తావించబడింది. శ్రీరాముడు అపార్థం వల్ల సీతాదేవిని అరణ్యంలో విడిచిపెట్టినప్పుడు, ఆమెకు ఆశ్రయమిచ్చిన మహర్షి వాల్మీకి, ఆమెను తన ఆశ్రమంలో ఉంచి, ఆమె కుమారులు లవ-కుశులను పెంచారు.
వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పి, ధర్మ మార్గాన్ని సూచించిన వాల్మీకి మహర్షి, వారి జీవితంపై చెరగని ముద్ర వేశారు.
వాల్మీకి జయంతి వేడుకలు:
వాల్మీకి జయంతిని ప్రజలు ఉత్సాహంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ప్రధానంగా:
- శోభా యాత్రలు: మహర్షి వాల్మీకి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు. భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ పాల్గొంటారు.
- దేవాలయ ప్రత్యేక పూజలు: వాల్మీకి భక్తులు ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. రామాయణంలోని శ్లోకాలను పఠిస్తారు.
- దానధర్మాలు: పేదలకు భోజనం, వస్త్రాలు మరియు అవసరమైన సామగ్రిని పంపిణీ చేస్తారు.
- భక్తి గీతాలు: ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వాల్మీకి మహర్షి మహిమను సూచించే గీతాలు ఆలపిస్తారు.
మహర్షి వాల్మీకి మహత్త్వాన్ని తెలియజేసే కొంత గొప్ప సందేశాలు:
- “ఒక మనిషి ఏదైనా ఇచ్చినా, అతని మనసు దాని మీదే ఉంటే, అది నిజమైన దానం కాదు.”
- “కాలం కంటే గొప్ప శక్తి ఏది లేదు.”
- “ఎటువంటి పని అయినా మితిమీరితే అది దుష్పలితమే.”
- “కోపం, అసహనం లేదా దురాశ కారణంగా ఎవరినీ అవమానించవద్దు.”
- “తప్పుదారిలో నడిచిన వారు కూడా సత్మార్గాన్ని అనుసరిస్తే, మహర్షి వాల్మీకిలా మారగలరు.”
ముగింపు:
మహర్షి వాల్మీకి జీవితానికి సారాంశం – మార్పు ఎప్పుడైనా సాధ్యమే. తన గతాన్ని పశ్చాత్తాపంతో మార్చుకున్న మహర్షి, ధర్మ మార్గంలో నడిచి, తన పేరును చరిత్రలో చిరస్థాయిగా నిలిపారు. ఆయన రామాయణాన్ని రాయడం ద్వారా ప్రపంచానికి వెలుగునిచ్చారు.
ఈ జయంతి రోజున, మనం కూడా సత్మార్గంలో నడవాలని, ధర్మాన్ని పాటించాలని సంకల్పించుకుందాం.
Related Posts:
నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం. | 108 Names of Sampurna Ramayanam in Telugu