
31-10-2020 – వాల్మీకి మహర్షి జయంతి
వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించి, వారిని తలంచుకుని, నమస్కరించుకుని, వారు రచించిన మహా గ్రంథములలో ఒక శ్లోకం స్మరణ చేసుకుందాం.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ, అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు.
నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. రామ అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు మరా అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపంచేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగకు ఆపాదిస్తాడు.వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.