భక్తి మనసులో ఉంటే చాలదా? బైటకు ప్రదర్శించాలా?

0
586

బొట్టు పెట్టుకోవడం, రుద్రాక్షలు, తులసిమాలలు వేసుకోవడం ‘ప్రదర్శన’ అనిపించుకోదా? భక్తి మనసులో ఉంటే చాలదా? బైటకు ప్రదర్శించాలా?

మనసులో ఉంటే తప్పకుండా బయటా ఉంటుంది. శరీరాన్ని శుద్ధిచేసే విధానాల్లో ఇవి ఒకటి. వీటిని దైవచిహ్నాలు, దైవరక్షలు అంటారు. ఇవి ప్రదర్శన కోసం అనడం తగదు. అయితే కొందరు ఆడంబరం కోసం చేసి ఉండవచ్చు. కానీ అందరిదీ అదే పద్దతి అనడం తగదు కదా. సంఘం దృష్టిలో గౌరవంగా కనబడడానికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలంకరించుకుంటారు. అలాంటి అలంకరణలో భాగంగా కొందరు దీన్ని భావించవచ్చు. 

శాస్త్రరీత్యా – భ్రూమధ్యం జ్ఞానరూపుడైన దైవం యొక్క స్థానం. అక్కడ బిందురూపుడిగా భగవంతుని ధ్యానించే యోగ విధానమూ ఉంది. అలాగే రుద్రాక్ష, తులసి, స్పటికం – వీటి వైద్య మహిమలు కూడా ఇటీవల శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆధ్యాత్మికంగా కూడా ఈ చిహ్నాల ధారణ కచమవుతుందనీ, కనిపించని సూక్ష్మ జగత్తులో కూడా రక్షణనిస్తుందనీ మన పురాణాలు, మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. భక్తులైన వారికి దైవంపైనా, శాస్త్రం పైనా నమ్మకం ఉంటుంది. ఈ చిహ్నాల వల్ల దైవకృప, దైవచింతన నిరంతరం సన్నిహితమవుతుందని భక్తులు దీనిని ధరిస్తారు. అంతేకానీ ఆర్బాటం కోసం కాదు. బైట కనిపించేదంతా మనసులో ఉండకపోవచ్చు గానీ, మనసులో ఉన్నది మాత్రం బయట కనిపించి తీరుతుంది.

– బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు 

మానసిక ఒత్తిడులను దూరం చేసుకోండి | How can psychological stress be reduced in Telugu.

నవవిధ భక్తి మార్గములు తెలుసా? Nine Ways Of Devotions in Telugu