- ఎలర్జీలు… ఆయుర్వేదం చికిత్సలు | Ayurvedic tips for Allergy in Telugu
Ayurveda tips for allergy
- ఎలర్జీ చాలా మందికి చిరపరిచయమైన పదం. ప్రతి పదిమందిలోనూ కనీసం ఇద్దరికి ఏదో ఒక రూపంలో ఎలర్జీలు బాధిస్తాయని పరిశీలనలు చెబుతున్నాయి.
- దీర్ఘకాలంపాటు బాధించే ఎలర్జీలకు శాశ్వత పరిష్కారం కోసం బాధితులు అన్వేషిస్తుంటారు. అటువంటి వారికి ఆయుర్వేదం ఎలా రక్షిస్తుందో చూడండి.
వ్యాధి రక్షణ శక్తి తగ్గటం, కాలుష్యాలు పెరగటం అనే రెండు ముఖ్యమైన అంశాల కారణంగా ఎలర్జీలు బలపడి మొండిగా తయారవుతాయి.
బలవంతంగా అణిచిన కొద్దీ ఎలర్జీలు ఏదో ఒక రూపంలో బహిర్గతమవుతూనే ఉంటాయి. కారణాన్ని కనిపెట్టి మూలానికి వెళ్లి చికిత్స చేయడమొక్కటే దీనికి శాశ్వత పరిష్కారం. ఆయుర్వేదం ఈ దిశగా పనిచే స్తుంది.
వ్యాధి వ్యవస్థ ప్రతిస్పందన అసాధారణంగా పెరగడాన్ని ఎలర్జీగా చెప్పవచ్చు. వాతావరణంలోని ఎలర్జీ కారకమైన ‘ఎలర్జన్‘కి వ్యతిరేకంగా శరీరం మితిమీరి ప్రవర్తించినప్పుడు ఎలర్జీ పుడుతుంది.
మామూలు సందర్భాల్లో మామూలు వ్యక్తుల్లో ఏ రకమైన చర్యా కలిగించని కొన్ని పదార్ధాలను కొంతమంది శరీరం హానికరమైనవిగా భ్రమపుడుతుంది.
ప్రతి చర్యగా అనేక లక్షణాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ లక్షణ సముదాయమే ఎలర్జీ. ఆయుర్వేదంలో ఎలర్జీ లక్షణాలకు సంబంధించిన వివరణ పీనసం,ఉదర్ధం,కోఠరం, కండూ తదితర పదాలతో కనిపిస్తుంది.
1. ఎలర్టీ ప్రక్రియ:
ఎలర్జీ అనేది ప్రాప్తించేటప్పుడు ఒక నిర్దుష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. శరీరేతరమైన ఎలర్జనకి వ్యతిరేకంగా పోరాడేందుకు శరీరం ఐజి-ఇ అనే ప్రత్యేకమైన యాంటీ బాడీని (ప్రతిరక్షణ కణం) విడుదల చేస్తుంది.
ఈ యాంటీ బాడీలు రక్తం లోని మ్యాస్ట్ కణాలతో కలుస్తాయి. ఈ మాస్ట్ కణాలనేవి ఎలర్జీలు శరీరంలోనికి ప్రవేశించే ప్రాంతాల్లో, అంటే శ్వాసమార్గాలూ జీర్ణవ్యవస్థ మొదలైన చోట్ల హెచ్చు సంఖ్యలో ఉంటాయి.
ఎలర్జీ ప్రక్రియలో భాగంగా ఈ మ్యాస్ట్ కణాలు విచ్ఛిన్నమవుతాయి. వీటి నుంచి అనేక రకాల రసాయన పదార్దాలు విడుదలవుతాయి. ఈ పదార్థాల్లో హిస్టమిన్స్ ముఖ్యమైనవి.
ఎలర్జీ లక్షణాలకు కారణం ప్రధానంగా హిస్టమిన్లే. ఒకవేళ ఎలర్జన్ అనేది చుట్టుపక్కల గాలిలో ఉండే కళ్ళు, ముక్కు ఊపిరితిత్తుల్లో ఎలర్జీ లక్షణాలు ఉత్పన్నమవుతాయి.
ఎలర్జీ ప్రక్రియలో భాగంగా మ్యాస్ట్కణాల నుంచి అధికమొత్తాల్లో రసాయన పదార్దాలు విడుదలైతే సర్వశరీరగతంగా దద్దుర్లు రావటం, రక్తపోటు ప్రమాదకరస్థాయిలో పడిపోవటం, తెలివితప్పటం వంటి షాక్ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.