కాత్యాయిని మాత వైభవం | Katyayani Mata Significance in Telugu.

0
2046

received_1025217087570979
కాత్యాయిని
ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!

నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః
ఆ తల్లి ఎంతమందికో కోరుకుంటే కూతురిగా వస్తుంది కాని, ఆవిడ మహా పతివ్రత కాబట్టి భర్తగా మాత్రం ఆ పరమశివుడినే వరిస్తుంది. ఒకప్పుడు కాత్యాయన మహర్షి తనకి బిడ్డలు కలగాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు.

ఈయనని అనుగ్రహిద్దాం అనుకున్నాడు పరమశివుడు. అందులో అంతర్లీలనంగా ఒక చమత్కారం జరిగింది. ఒకప్పుడు కైలాస పర్వతం మీద కూర్చుని పరమశివుడు ఉంటే, ప్రణయ వినోదంగా భర్తతో ఆటలాడుతూ పార్వతీదేవి వెనకనుండి వచ్చి ఆయన రెండు కన్నులు మూసింది.

ఆయన కళ్ళు సూర్యచంద్రులు. ఆయన కళ్ళు మూసేటప్పటికి లోకమంతా చీకటి అయింది. పరమశివుడు లోకాలను ఆదుకోవడం కోసం మూడవ కన్నుని తెరిచి అగ్ని సంబంధమైన కాంతిని వర్షించాడు. ఆమె అన్ని తెలిసిన తల్లే.

అయినా ఏమీ తెలియని దానిలా భర్త వంక చూసి నేను ప్రణయానికి మీ కన్నులు మూసినప్పుడు లోకానికి జరిగిన ఇబ్బంది గమనించాను.

ఇంత మంది ఇబ్బంది పడడానికి నేను కారణం అయ్యాను. నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనగానే, పరమశివుడు భూమండలం మీదకి వెళ్లి తపస్సు చెయ్యమన్నాడు.

తద్వారా ఆ కాత్యాయన మహర్షి కోరిక కూడా తీరుతుంది. ఆమె వెంటనే ఒక శివస్వరూపాన్ని పొంది బదరికాశ్రమంలో పడుకుని ఉన్నది.

కాత్యాయన మహర్షి పిల్లల కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆయనను అనుగ్రహించి ఆ బిడ్డ కాత్యాయని మహర్షి కంటబడింది. ఆయన ఆ బిడ్డని తీసుకొని పెంచాడు కాబట్టి కాత్యాయిని అయింది.

నీ భర్తని తెలుసుకోవలసిన సమర్ధత నీదే (ఆమె ఎంత మందికైనా కూతురిగా వస్తుంది కాని భర్త మటుకు ఆ పరమశివుడే) ఆ పరమశివుని భర్తగా పొందడానికి ఎక్కడ తపస్సు చేస్తే సిధ్ధిస్తుందో ఆ ప్రదేశం దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం.

అక్కడికి వెళ్ళమని మహర్షి చెప్పాడు. నీవు కాంచీపురానికి వెళ్లావు అనడానికి గుర్తు నీకు కొన్ని వస్తువులను ఇస్తున్నాను. ఒక గొడుగు, వింజామర, గంగాతీర్ధం, గంగ ఒడ్డున ఉన్న ఇసుక, ఒక యోగదండము, ఒక పుస్తకము, వేయించిన పెసలు ఇస్తాను.

ఈ వస్తువాలన్నీ నీవు కాంచీపురం చేరగానే మార్పు చెందుతాయి అని వివరించాడు. ఆమె రెండు చేతులతో కుప్ప చేసి సైకతలింగాన్ని పూజిస్తున్నది.

ఏమి చేస్తుందో చూడాలని తన జటాజూటం నుంచి బ్రహ్మాండంగా గంగా ప్రవాహాన్ని వదిలిపెట్టాడు. ఆమె ప్రక్కనే ఉన్న దుర్గా స్వరూపాన్ని పిలిచి ఆ ప్రవాహాన్ని ఆపమన్నది.

ఆమె జలప్రళయ బంధిని అనే పేరుతో తన దగ్గిర ఉన్న కపాలంలోకి గంగ అంతా పట్టేసింది. పరమశివుడు చూసి తన వద్ద ఉన్న చెలికత్తె సహాయంతో ప్రవాహాన్ని ఆపింది.

భూమ్యాకాశాలు ఎకమయ్యేలా పరమశివుడు తిరిగి ప్రవాహాన్ని పంపాడు. ఆవిడ భయపడి అన్నగారు అయిన విష్ణుమూర్తిని పిలిచి శివలింగం కొట్టుకుపోతుందేమో అని మురిపెంగా భయంగా చెబితే ఆవిడ పతిభక్తి చూసి ఆశ్చర్యపోయిన విష్ణుమూర్తి ఆనందిస్తూ అమ్మా!

నీకు, నీవు కొట్టుపోతావని బెంగకాదు. శివలింగం గురించి బెంగ. నీ భక్తిని ఆవిష్కరించు, బావగారు సంతోస్తారు. అనగానే వంగి ఆవిడ శివలింగాన్ని కౌగలించుకున్నది.

ఇప్పటికీ ఏకాంబ్రేశ్వర శివలింగం మీద పార్వతీదేవి కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణాల ముద్రలు ఉంటాయి. నీటితో అభిషేకం చేయకూడదు కాబట్టి మల్లెనూనేతో అభిషేకం.

ఆమె భక్తిని చూసి పరమశివుడు పరవశించిపోయి, ఆయన గభాలున అవతరించి తాను వదిలిపెట్టిన గంగే కదా అని కాలితో ఒక్క తన్ను తన్నాడు. వెంటనే గంగ భూమిలోనికి అంతర్వాహినిగా వెళ్ళింది.

ఎప్పుడైతే నీటి ప్రవాహాన్ని చూసి అమ్మవారు భయపడి శివలింగం కొట్టుకు పోతుంది అని భయంతో కంప, కంప అన్నదో అది కంపానది అయింది. ఇక్కడ అమ్మవారు పరిమళ కుంతలాంబ. ఆవిడే తపోకామాక్షి. ఆ తపో కామాక్షియే కాత్యాయినీ స్వరూపం.

లోకంలో ప్రేమ, భర్త యందు భక్తి, ఏకకాలంలో ఆవిష్కరించిన తల్లి కాబట్టి ఆ తల్లి నామస్మరణ చేత సువాసినుల పసుపుకుంకాలు పదికాలాలు నిలబడేటట్లు చేసి, ఎన్ని జన్మలు ఎత్తినా సువాసినులుగా ఉండేటట్లు అనుగ్రహించగల శక్తి ఉన్న తల్లి మన తల్లి కాత్యాయిని.

ఆ తల్లి కాత్యాయినిని అందరం భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి కృపకు పాత్రులం అయ్యెదముగాక.
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here