కార్తీక పురాణము – దశమాధ్యాయము | Karthika Puranam Tenth Chapter in Telugu

0
982

కార్తీక పురాణము – దశమాధ్యాయము | Karthika Puranam Tenth Chapter in Telugu

జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మమందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పినమాటలను విని యమభటులు ఎందుకు యూరకుండిరి? యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడునునగు అజామిళునికి తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము చేయుటచేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను జ్పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణనుజేయువాడుజ్ జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునొందును. యముడిట్లు విచారించి యూరకుండెను.
అజామిళుడు పూర్వ జన్మమున సౌరాష్ట్రదేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యమును హరించుచు స్నానసంధ్యలను విడిచి అన్యమానసుడై శివుని పూజించుచు శివునకభిముఖముగా కాళ్ళు చాపుకుని శయనించుచు ఆయుధపాణియై స్నేహితులతో గూడి నానాలంకార శోభితుడై స్వేచ్ఛావిహారముల తిరుగుచు బహుభాషియై మంచి యౌవనముతో నుండెను. ఆయూరిలోనొక బ్రాహ్మణుడుండెను. అతనికొక రూపవతియు యౌవనవతియగు భార్యగలదు. ఆబ్రాహ్మణుడు దరిద్రపీడితుడై అన్నముకొరకై పట్టణములు, గ్రామములు పల్లెలు తిరుగుచు యాచించుచుండెడివాడు. ఒకానొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధ్యాన్యాదికమును శిరస్సుననుంచుకొని ఆకలితో యింటికివచ్చి భార్యతో ఓసీ! నాకుఆకలి కలుగుచున్నది. త్వరగా వంటచేయుము. ముందు మంచినీళ్ళిమ్ము త్రాగి శాంతించెదను. భర్త యిట్లెన్ని మారులడిగినను భార్య అతని మాటను లెక్కచేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు యూరకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యనుగొట్టెను. భార్య భర్తను పిడికిలితో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరముబోయి అచ్చట భిక్షమెత్తుకొని జీవించుచు భార్యసంగతిని గూర్చి చింతించుచుండెను. భార్యయు సుఖముగానుండి రాత్రి భుజించి మంచి చీరెధరించి తాంబూలము స్వీకరించి యొక చాకలివాని ఇంటికిపోయెను. సుందరుడయిన చాకలివానిని జూచి రాత్రి నాతో సంభోగించుమనెను. ఆమాటవిని వాడు నీవు బ్రాహ్మణ స్త్రీవి. అర్థరాత్రివేళ మాయింటికి రావచ్చునా? మీరు గొప్పకులమునందు బుట్టినవారు. మేము నిందుతులము. కాబట్టి యిట్టి సంపర్కము మీకు తగునా? ఈప్రకారముగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆమెను కొట్టెను. ఆమెయు వానిని కొట్టి వానిని విడిచ రాజమార్గమున బోవుచుండగా పైనజెప్పిన శివార్చకుని జూచెను. అంతలో ఆస్త్రీ వానిని పట్టుకుని రతికేళికి రమ్మనమని పిలుచుకొనిపోయి వానితో భోగించి రాత్రియంతయు వానితో కాలక్షేపము చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమునుబొంది భర్తవద్దకు బోయి ఆయనను బ్రతిమాలి ఆయనతో గూడా గృహమందు సౌఖ్యముగా నుండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతినొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములననుభవించి తిరిగి భూమియందు సత్వనిష్ఠుని కొడుకు అజామిళుడై జన్మించెను. ఇతనికి కార్తీకపున్నమినాడు శివదర్శనము లభించినది. అంత్యకాలమందు హరినామస్మరణ గలిగినది. ఆ హేతువులచేత సప్తజన్మార్జిత పాపములు నశించి మోక్షమును బొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమునకు మృతినొంది నరకములందనే యాతనలనొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రికగా జన్మించెను. చండాలుడు ఈమె పుట్టిన సమయము మంచిదాయని యొక బ్రాహ్మణునియడిగెను. అతడు ఈమె తండ్రిగండాన పుట్టినదని చెప్పెను. ఆమాటవిని చండాలుడు ఆశిశువును దీసుకొనిపోయి అరణ్యమందుంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు జూచి రోదనము చేయుచున్న ఆ శిశువును దీసికొనిపోయి తన ఇంటిలో దాసీగానున్నయొక స్త్రీకి నప్పగించెను. ఆదాసీది ఈమెను పెంచెనది. తరువాత ఈమెను అజామిళుడు దగ్గరకు తీసెను. తరువాత కథ పూర్వోక్తమే. రాజోత్తమా! ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానము. అజామిళుని పూర్వ వృత్తాంతము. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టము. హరినామకీర్తనము చేసిన ప్రాయశ్చిత్తములతో పనిలేదు. అదిగాని యెడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చేయవలెనని భావము. ఎవ్వనియొక్క నాలుక హరినామ కీర్తనము చేయదో, మనస్సు హరి పాదపద్మమును స్మరించదో చెవులు హరిచరిత్రములను వినదో వాని పాపములు యెట్లు నశించును? ఇతర చింతను మాని హరిని స్మరించువారు ముక్తినొందెదరు. ఇందుకు సందియములేదు. కార్తీకధర్మమునకు పాపములను నశింపజేయి సామర్ధ్యమున్నది. కాబట్టి కార్తీక మాసమందు ధర్మమాచరించనివాడు నరమునొందును. ఇది నిశ్చయము. పాపములను నశింపజేయి ఈకథను విన్నవారు సమస్త పాపములను నశింపజేసి మోక్షమొందుదురు. ఈకథను వినిపించువారు పాపవిముక్తులై వైకుంఠమందు విష్ణువుతో గూడి సుఖించును.
ఇతి శ్రీస్కాందపురాణే కార్తీకమహాత్మ్యే దశమోధ్యాయస్సమాప్తః

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

Android

iOS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here