కార్తిక పురాణము – షష్ఠ అధ్యాయము | Karthika Puranam Sixth Chapter in Telugu

0
979

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

1. కార్తిక పురాణము – షష్ఠ అధ్యాయము

అథ షష్ఠాధ్యాయ ప్రారంభః

వశిష్ఠుడు మరల ఇట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును.

సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము జేసిన వారు జ్ఞానమును బొంది విష్ణులోకమును బొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి వత్తిని చేసి బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను జేసి గోఘృతమును బోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను. ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి బంగారముతో వత్తిని చేయించి బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును జెప్పుచు ఆదీపమును దానము జేయవలెను.

శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం!
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!

దీపము సర్వజ్ఞానదాయకము. సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును జేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతరము శాంతి కలుగుగాక. ఈ ప్రకారముగా స్త్రీగాని, పురుషుడుగాని, కార్తీకమాసమందాచరించిన యెడల అనంతఫలమును బొందుదురు. దీపమును పెట్టిన వారు విద్యను శాస్త్రఫలమును ఆయుస్సును స్వర్గమును సమస్త సంపత్తులను పొందుదురు. కార్తీక దీపదానమువలన మనోవాక్కాయములచేత చేయబడిన తెలిసి, తెలియక జేసిన పాపములు నశించును. ఈవిషయమందు పురాతనపు కథ యొకటి ఉన్నది వినుము.

కథ

పూర్వకాలమున ద్రవిడదేశమందు సుత బంధువిహీనయైనయొక స్త్రీ గలదు. ఆస్త్రీ నిత్యము భిక్షాన్నము భుజించెడిది. ఎప్పుడు దూషితాన్నమును భుజించెడిది. చద్ది అన్నమునే తినెడిది. నిత్యము ధనము తీసుకొని పరులకు వంట కుట్టుపని, నూరుట, రుబ్బుట మొదలయిన పనులను చేసెడిది. అమ్మకము కొనుటయి చేయుచుండెడిది. ఇట్లు వచ్చిన ద్రవ్యముతో ధనవంతురాలైనది. ఆస్త్రీ విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. హరికథను వినలేదు పుణ్యతీర్థములకు పోలేదు. ఏకాదశినాడు ఉపవాసము చేయలేదు. అనేక వ్యాపారముల చేత ద్రవ్యమును చాలా సంపాదించినది గాని తాను తినలేదు పరులకు పెట్టలేదు. ఇట్లు అజ్ఞానముతో మునిగియున్న ఆమె ఇంటికి దైవయోగమువలన శ్రీరంగమునకుబోవు కోరికగల ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని జూచి అయ్యో ఈచిన్నది అన్యాయంగా నరకములపాలు కాగలదని దయగలిగి ఆమెతో ఇట్లనియె. ఛీ మూఢురాలా ఇప్పుడు నామాటలను వినుము. విని చక్కగా ఆలోచించుము. ఈదేహము సుఖదుఃఖములతో గూడినది. చర్మము, మాంసము, ఎముకలు వీటితో గూడినది. దుఃఖములము నిలయము. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను పంచభూతముల వలన కలిగినది. దేహము నశించగా పంచభూతములు చూరులందుపడిన వర్షబిందువుల వలె పడి తొలగిపోవును. ఈదేహము నీటిమీది బుడగవలె నశించును. ఇది నిశ్చయము. నిత్యముగాని దేహమును నిత్యమని నమ్మితివి. ఇది అగ్నిలోపడిన మిడుతవలె నశించును. కాబట్టి మోహమును విడువుము. సత్యస్వరూపుడు భూతములందు దయగలవాడగుహరిని ధ్యానించుము. కామమనగా కోరిక, క్రోధమనగా కోపము లోభమనగా ఆశ, మోహమనగా మమకార అహంకారాలు వీటిని విడువుము. ద్రవ్యము వదలుము. నిశ్చలమైన భక్తితో హరిపాదారవింద ధ్యానము చేయుము. కార్తీకమాసమందు ప్రాతస్స్నానమాచరించుము. విష్ణుప్రీతిగా దానము చేయుము. బ్రాహ్మణునకు దీపదానము చేయుము. అట్లుచేసిన యెడల అనేక జన్మముల పాపములు నశించును. సందేహమువలదు. ఇట్లు చెప్పి బ్రాహ్మణుడు తూర్పుగా వెళ్ళెను. తరువాత ఆమాటలు నమ్మి విచారించి ఆశ్చర్యమొంది చేసిన పాపకములకు వగచి కార్తీకవ్రతమును ఆరంభించెను. సూర్యోదయసమయాన శీతోదకస్నానము, హరిపూజ, దీపదానము, తరువాత పురాణశ్రవణము ఈప్రకారముగా కార్తీకమాసము నెల రోజులు చేసి బ్రాహ్మణభోజన సమారాధన చేసెను. నెలరోజులు శీతోదక స్నానము చేయుట చేత ఆస్త్రీకి శీతజ్వరకు సంభవించి గర్భమందు రోగముజనించి రాత్రింబగళ్ళు పీడితురాలై బంధుహీనయై దుఃఖించి చివరకు మృతినొందినది. తరువాత విమానమెక్కి శాశ్వత స్వర్గసుఖములను పొందినది. కాబట్టి కార్తీకమాసమందు అన్నిటికంటె దీపదానము అధిక పుణ్యప్రదము. కార్తీక దీపదానము తెలిసి తెలియక చేసిన పాపములను నశింపజేయును. ఇట్లు పూర్వము శివుడు పలికెను. రాజా!ఈరహస్యమును నీకు జెప్పితిని. దీనిని విన్నవారు జన్మ సంసారబంధనమును త్రెంచుకుని వైకుంఠము బొందుదురు.

ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే షష్ఠాధ్యాయస్సమాప్తః

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here