“అన్నవరం” సత్యదేవుడు..! | Annavaram Satyanarayana Swamy Temple in Telugu

0
2451
Annavaram Satyadeva
“అన్నవరం” సత్యదేవుడు..! | Annavaram Satyanarayana Swamy Temple in Telugu

“అన్నవరం” సత్యదేవుడు..! – Annavaram Satyadeva

అడిగిన వరాలన్నీ ఇచ్చే “అన్నవరం” సత్యదేవుడు..!!అన్నవరం సత్యదేవుడిని దర్శించినా, సత్యనారాయణుడి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయనీ.. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. అడిగిన వరాలన్నీ ఇచ్చే దేవుడు కాబట్టి “అన్నవరం సత్యదేవుడి”గా భక్తులచే పూజలందుకుంటున్న ఈ స్వామి ఆలయానికి శతాబ్దాల చరిత్ర కలదు. భక్తులపాలిట కొంగుబంగారమై విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో తయారయ్యే ప్రసాదం అమృతంకంటే రుచిగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కార్తీక మాసంలో కనీవినీ ఎరుగని రీతిలో భక్తులు తరలివచ్చే ఈ ఆలయ విశేషాలేంటో అలా చూసి వద్దామా..?!

పురాణాల ప్రకారం అన్నవరంలో వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ చరిత్రను చూస్తే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు బేధం లేదని చాటి చెప్పేందుకే ఇక్కడ వెలసినట్లుగా తెలుస్తోంది. భూలోకంలో పరస్పరం కలహాలతో జీవనం గడుపుతున్న ప్రజలను బాగుచేయమని త్రిలోక సంచారి నారద మహర్షి శ్రీమన్నారాయణుడిని కోరారట.

ఆయన కోరిక మేరకు హరిహర బ్రహ్మ అంశాలతో కూడి శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి అనే పేరుతో అన్నవరంలో ఉద్భవించి, మానవులను ఉద్ధరిస్తాననీ శ్రీమన్నారాయణుడు వాగ్దానం చేశారట. అన్నట్లుగానే నారాయణుడు సత్యనారాయణుడిగా అన్నవరంలో స్వయంభువుగా అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అయితే అంతకుముందు భూలోకంలో ఏ ప్రదేశం తన అవతారానికి తగినదిగా ఉంటుందని ఆలోచించిన నారాయణుడు ఆంధ్రభూమే అందుకు సరైనది నిర్ణయించుకున్నారట. గతంలో తాను ఇచ్చిన వరాలను దృష్టిలో ఉంచుకున్న ఆయన, రత్నగిరికి ఆనుకుని ఉండే పంపానదీ తీరంలోని అన్నవరం గ్రామం అందుకు అనుకూలమైనదని, తన ఆవిర్భావానికి నారాయణుడు నాంది పలికారట.

దీంతో ఏ శుభ సమయంలో రత్నగిరి కొండపై శ్రీమన్నారాయణుడు స్వయంభువుగా సత్యనారాయణుడిగా అవతరించారో.. అదే సమయంలో అన్నవరంలో నివసించే భక్తాగ్రేసరుడు, ఉత్తముడు అయిన శ్రీ రాజా ఇనుగంటి వెంకట రామనారాయణం బహద్దూర్ వారికి కలలో దర్శనమిచ్చారట. ఆ కలలో తన జన్మ వృత్తాంతమును వివరించిన సత్యదేవుడు తనవద్దకు రమ్మని బహదూర్‌ను కోరారట. వెంటనే ఆయన గ్రామదేవతను దర్శించుకుని స్వామివారి కోసం రత్నగిరిలో వెతుకులాట ప్రారంభించారట.

అలా రత్నగిరిపై బహద్దూర్ వెతకగా, వెతకగా ఓ అంకుడు చెట్టు కింద సత్యదేవుడు స్వయంభువై దర్శనమిచ్చారట. వెంటనే స్వామివారి విగ్రహాన్ని భక్తిప్రపత్తులతో బహదూర్ ప్రతిష్టించారట. ఇక ఆనాటి నుంచి సత్యదేవుడు భూలోక సంరక్షణార్థం నిత్యపూజలు అందుకుంటూ, ప్రజల పాపాలను హరిస్తూ.. అందరూ సుఖసంతోషాలతో జీవించేలా చేస్తూ వేనోళ్ల కొనియాడబడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here