
హనుమంతుని ఎన్నో రూపాలను చూస్తుంటాం. పంచముఖ హనుమంతుడనీ,సప్త ముఖ హనుమంతుడనీ, బాల హనుమంతుడనీ, ధ్యానాంజనేయుడనీ ఇలా ఎన్నో రకాల రూపాలతో ఆంజనేయుని ఆలయాలు నిత్యం దర్శిస్తాం. కానీ హనుమంతుడు తనకు తానుగా ఒక యంత్రానికి బద్ధుడై, యంత్ర స్వరూపంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం యంత్రోద్ధారక హనుమంతుని గుడి.
2. యంత్రోద్ధారక హనుమంతుడు ఎలా వెలిశాడు..?
వ్యాసరాయరు గొప్ప హనుమద్భక్తుడు. అతను హనుమంతుని బొమ్మను ఒక బొగ్గుముక్కతో గీసి ఆ రూపాన్ని పూజించేవాడు. ఒకనాడు హంపీ క్షేత్రం లో తుంగభద్రా నదీ తీరాన చక్రతీర్థం లో ఒక బండరాయిపైన ఆంజనేయుని బొమ్మను యథావిధిగా బొగ్గుతో గీశాడు. పూజ చేస్తుండగా ఉన్నట్టుండి ఆ బొమ్మ నిజమైన కోతిలా మారి బండరాయినుండీ బైటికి దూకి వెళ్లిపోయింది. ఇలా పన్నెండు రోజులు జరిగింది. ఇక వ్యాసరాయరు అలసిపోయి ఈ పరీక్షనుండి కాపాడమని ఆంజనేయునే ప్రార్థించాడు. రాయరు ప్రార్థనకు కరిగిన ఆంజనేయుడు తనంతట తానుగా ధ్యానం లో రాయరుకి ఆంజనేయ యంత్రాన్ని తెలిపి యంత్రానికి బద్ధుడై అందులో కూర్చున్నాడు. అంతకుముందు బండ రాయి నుండీ తప్పించుకున్న పన్నెండు కోతులనూ యంత్రానికి చుట్టూతా ఉంచాడు. ఈవిధంగా యంత్రోద్ధారక హనుమంతునిగా ఆంజనేయ శక్తి అక్కడ నిక్షిప్తమై ఉంది. ఈ ఆలయం ఒక చిన్న కొండమీద నిర్మింపబడి ఉంది. అక్కడ మహాపురుషుడైన వ్యాసరాయని ఆధ్యాత్మిక శక్తి ఇప్పటికీ తిరుగాడుతున్న అలౌకిక అనుభూతి భక్తులకు కలుగుతుంది.
కర్ణాటక రాష్ట్రంలో ,బళ్ళారి లోని హోస్పేట లో గల చక్రతీర్థం లో యంత్రోద్ధరక హనుమంతుని ఆలయం ఉంది. హంపినుంచీ ఇది పన్నెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది.