
Uma Maheshwara Sin Destroyer
శ్రీశైలానికి వెళ్ళేదారిలో హైదరాబాదుకు 100 కిలోమీటర్ల దూరం లో, మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట దగ్గరలో ఉమామహేశ్వరస్వామి దేవాలయం ఉంది. మహా మహిమాన్వితమైన ఉమామహేశ్వర స్వామిని దర్శించనిదే శ్రీశైల యాత్ర పూర్తి కాదని పెద్దలుచెబుతారు. శ్రీశైల మల్లిఖార్జునుని ఆలయానికి ఉత్తర ద్వారా దిశగా ఉమామహేశ్వరాలయం ఉంటుంది.ఎత్తైన కొండప్రాంతం లో మహావృక్షాలతో నిండిన ఉమామహేశ్వరుని ఆలయ వాతావరణం యే కాలం లో అయినా చల్లగానే ఉంటుంది. ఈ ప్రాంతం పేదవారి ఊటీ గా పేరెన్నిక గన్నది.
ఉమామహేశ్వరుని దివ్యమంగళ రూపం :
ఇక్కడి శివపార్వతులు మల్లిఖార్జునుడు, భ్రమరాంబల రూపాలలో కొలువై ఉంటారు. ఇక్కడి శివలింగం స్వయంభూ లింగం. ఒకవైపు తెల్లని తెలుపు, మరొకవైపు ఎర్రని రక్తవర్ణాన్ని కలిగి ఉంటుంది. కుడివైపు మహిషాసుర మర్దిని ఎడమ పక్కన ఉమాదేవి విగ్రహాలు కొలువై ఉంటాయి. ఆలయానికి దగ్గరలో వీరభద్రుని గుడి,కుమారస్వామి ఆలయం, జగన్నాధుని ఆలయం, నాగేంద్రుని విగ్రహం ఉంటాయి.
అబ్బురపరిచే పాపనాశం :
గుడికి దగ్గరలో పాప నాశం ఉంటుంది. ఎత్తైన బండరాళ్ళ అడుగు భాగం నుంచీ స్వచ్చమైన నీరు ఊరుతూ ఉంటుంది. ఎన్ని సార్లు తోడినా అక్కడి పాప నాశం లోని నీటి ఊట ఎండిపోదు. సంవత్సరం పొడవునా అక్కడ నీటికి కరువుండదు. ఆలయ సమీపం లో వెయ్యి ఏనుగులు ఒకేసారి స్నానం చేయగల పెద్ద నీటి తొట్టి ఉంటుంది.
ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు..?
ఈ ఆలయం క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దం లో మౌర్య చంద్ర గుప్తుని కాలం లో నిర్మించబడింది. ఇక్కడ శంభుదాసుడైన ఎఱ్ఱన కవి పటం ఉంటుంది.
అక్కడికి ఎలా వెళ్ళాలి?
మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట కు 12 కి.మీ. దూరం లో ఉమామహేశ్వరం ఉంటుంది. అచ్చ పేట తర్వాత రంగాపురం దాటగానే ఉమామహేశ్వరాలయం ఉంటుంది.