
4. విఠలుని లీల
అప్పుడు ఆమెను చూసి విఠలుని రూపం లోని బ్రాహ్మడు ‘అమ్మా నీ ముక్కెర ఇస్తే నా అవసరం తీరుతుంది.’ అన్నాడు. అతని పరిస్థితి చూసి జాలిపడి, విఠలునిపై భారం వేసి ఆమె వెంటనే తన ముక్కెర తీసి ఇచ్చింది.
విఠలుడు శ్రీనివాసనాయకుని ముందే ఆ ముక్కెరను అమ్మేసి డబ్బు తీసుకుని వెళ్లిపోయాడు. అతను అమ్మిన ముక్కెర తన భార్యదే అని గ్రహించిన శ్రీనివాసుడు కోపంగా ఇంటికి వెళ్ళాడు. భార్య ముక్కుపుడక ధరించి ఉండక పోయే సరికి ఉగ్రుడై ‘ నీ ముక్కు పుడక తీసుకురా’ అన్నాడు.
ఆమె భయం తో వణుకుతూ లోపలికి వెళ్లింది. భగవంతుడు వచ్చి భక్తులను ఆదుకోడానికి ఇదేమైనా సత్యకాలమా. నాకింక మరణమే మార్గం అని ఆత్మ త్యాగం చేసుకోబోయింది. అంతలో విఠలుడు అశరీరంగా ‘ అమ్మా నీ ముక్కెర ఇదిగో.
నీ దాన గుణానికి, సత్ప్రవర్తనకూ సంతోషించాను. అడిగిన వెంటనే లేదనక దానం చేసిన నీకు నేను ఋణపడి ఉన్నాను.’ అని ఆమె ముక్కెరను ఇచ్చాడు. ఆమె సంతోషం తో తన ముక్కు పుడక భర్తకు చూపింది.







