
సాయి బోధ / Sai Baba Bodha
సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.
6. గురువు యొక్క కరుణ
“నా గురువు నానుండి యితరమేమియు అశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాలసర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలసి యుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి యుండినను, వారి ప్రేమకు ఎన్నడును లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు, నన్ను గూడ మా గురువు తన దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండును. బిడ్డతాబేలు రెండవ యెడ్డున ఉండును. తల్లి తాబేలు, పిల్ల తాబేలుకు అహరము పెట్టుటగాని పాలిచ్చుటగాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దవి యగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టి నాయందు నిల్పి, నన్ను ప్రేమతో గాపాడిరి.
ఓ తల్లి! నా గురువు నాకు మంత్ర మేమియు నుపదేశించలేదు. అటువంటపుడు నేను నీ చేవిలో మంత్రమేట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమయిన తాబేలు చూపే మనకు సంతోషము నిచ్చునని జ్ఞాపక ముంచుకొనుము. మంత్రముగాని యుపదేశముగాని యెవ్వరివద్దనుండి పొందుటకు ప్రయత్నించకుము. నీయాలోచనలు, నీవు చేయు పనులు నాకొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నావైపు సంపూర్ణహృదయముతో చూడుము. నేను నీవైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియు మాట్లాడను. ఏ సాధనలుగాని యారు శాస్త్రములలో ప్రావీణ్యముగాని యవసరము లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసముల నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు, కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరయితే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో, ఎవరయితే గురుని బ్రహ్మవిష్ణుమహేశ్వర స్వరూపుడని యెంచెదరో వారే ధన్యులు!’
ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా యా ముసలమ్మను ఒప్పించెను. అమె బాబాకు నమస్కరించి యుపవాసమును వదలుకొనెను.







