హక్కు – బాధ్యతలు (ఈ రోజు కధ)

0
1352

నిఖిల్ తండ్రి పిల్లలకి “శ్రీ రామకృష్ణ ప్రభ” మాస పత్రికలోని పిల్లలు నేర్చుకోదగ్గ ఆర్టికల్ ని ఒకదాన్ని చదివి వినిపిస్తున్నాడు.

“పిల్లలు చిన్నప్పటి నించే బాధ్యతగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఏది తమ హక్కో ఏది కాదో అన్న అవగాహన కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి.

అప్పుడే వారు భవిష్యత్లో చక్కటి పౌరులు కాగలరు అనే వాక్యం చదివాడు.

ఆరేళ్ళ నిఖిల్ వెంటనే తండ్రిని ప్రశ్నించాడు.

“నాన్నా! బాధ్యత, హక్కు అంటే ఏమిటి?”

ఆయన వారికి వాటి గురించి కొద్ది మాటల్లో వివరించాడు. కానీ పిల్లలకి అవి అర్థం అయ్యాయని ఆయనకి తోచలేదు.

“సరే సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి మీకు పూర్తిగా అర్థం అయ్యేలా చెప్తాను” చెప్పాడాయన.

రెండురోజుల తర్వాత నిఖిల్ అక్క పద్నాలుగేళ్ళ భవిత తన ఫ్రెండ్ పుట్టినరోజుకి ఇచ్చే పార్టీకి ఒక రాత్రి వెళ్ళింది. రాత్రి తొమ్మిదికల్లా తన ఫ్రెండ్స్ ఇంటి దగ్గర కారులో దింపుతారని, పంపమని తల్లిని అనుమతి కోరితే ఆమె “తొమ్మిదికల్లా ఇంటికి వచ్చేట్లయితే వెళ్ళు అని, కూతురు చేత “సరే అనిపించి పంపింది.

ఐతే, రాత్రి తొమ్మిదికి భవిత తన ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతోంది కాబట్టి కొద్దిగా ఆలస్యంగా ఇంటికి వెళ్తే ఏమవుతుందని ఆటల్లో పడి ఆగిపోయింది. భవిత ఆ రాత్రి ఇంటికి చేరే సరికి పదకొండున్నర అయింది. మర్నాడు ఉదయం భవితని తల్లి నిలదీసింది.

“నిన్న రాత్రి నువ్వు ఇంటికి వచ్చే దాకా ఎంత భయం వేసిందో తెలుసా? తొమ్మిదికి వస్తానన్న దానివి ఆలస్యంగా వచ్చావు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఆ రెండున్నర గంటలు నాకెంత భయం వేసిందో తెలుసా?”

“అమ్మా! తొమ్మిదికల్లా రావాలన్న నియమాన్ని నువ్వే విధించావు. ఆ రెండున్నర గంటలు బాధపడటం అన్నది నీ ఛాయిస్ తప్పనాది కాదు” భవిత చెప్పింది.

“నువ్వ తొమ్మిదికి వస్తావని ఒప్పుకుని వెళ్ళి మాట తప్పడం నీ తప్పు కాని నాది కాదు. కనీసం ఫోన్ అయినా చేసి ఆలస్యంగా వస్తున్నానని చెప్తే నాకు వర్రీ ఉండేది కాదు.”

అది విన్న నిఖిల్ తండ్రి పిల్లలతో చెప్పాడు.

“విన్నారుగా? భవిత తను ఇచ్చిన మాటని తప్పడం తన హక్కుగా భావిస్తోంది. పైగా నిందని తొమ్మిది దాకానే అనుమతి ఇచ్చిన అమ్మ మీదకి తోస్తోంది. అది తప్పా? కాదా?”

తప్పే అని పిల్లలంతా ఒప్పకున్నాక అడిగాడు.

“హక్కు లేకపోయినా ఉందనుకోవడం అంటే ఏమిటో ఇప్పడు అర్థమైందా? ఇంకా అమ్మకి బాధ కలిగించినందుకు విచారపడక పోవడం బాధ్యతని విస్మరించడం ఆవుతుంది.”

నిఖిల్ కి హక్కు బాధ్యతలు అంటే ఏమిటో చక్కగా అర్దమయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here