రిజర్వేషన్ కోటా క్రింద ఒకప్పుడు ఆలయ ప్రవేశానికి నోచుకోని వారిని అర్చకులుగా నియమిస్తున్నారు. ఇది సముచితమేనా?

0
721

ఇప్పుడు అనేక మందిరాలలో రిజర్వేషన్ కోటా క్రింద ఒకప్పుడు ఆలయ ప్రవేశానికి నోచుకోని జాతుల వారిని అర్చకులుగా నియమిస్తున్నారు. ఇది సముచితమేనా? అసమానతలను తొలగించి హిందువులుగా జీవించడానికి ఇది సరియైన పరిష్కారమా?

ప్రస్తుతం ఈవిషయమై ఏం మాట్లాడినా అది వివాదాస్పదమే. కాలప్రభావంగా పరిగణించడమే. కానీ – నిదానంగా నిశితంగా పరిశీలిస్తే కొన్ని విశేషాలు స్పష్టమౌతాయి. ఇప్పుడు దేశంలో ప్రధానాలయాలన్నిటిలో అందరికీ ప్రవేశముంది. గర్భగుడిలోకి ఏ వర్ణం వారైనా సరే ప్రవేశించడానికి వీలులేని మందిరాలున్నాయి. వీటిలో పరంపరాగత సంప్రదాయంలోని వారే అర్చకులుగా ఉన్నారు. ఆ ఆలయ ఆగమాది పద్ధతులు వారికి అలవాటైనవి.
ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యాంశాలు గమనించాలి. పూజా విధానాలు నేర్చుకున్నంత మాత్రాన ఆలయాలలో అర్చనకు శిక్షనిచ్చినట్లే అని భావించడం సరికాదు. వారి నిత్యజీవన విధానం కూడా అర్చనకు పరిగణించాలి.

శాకాహారం – అదికూడా నిత్యం తాను సంధ్యాది అనుష్ఠానాలు, దేవతార్చన చేసి నివేదించిన పదార్థాన్ని స్వీకరించాలి. ఇంట్లో ఆడవారి రజస్వలా సమయంలో స్పర్శించిన వండిన ఆహారాలు తినరాదు, తాకరాదు. తానే కాక తన బంధువర్గాలు వచ్చినప్పుడు, వారిళ్ళకు తాను వెళ్ళినప్పుడు కూడా ఈవిధంగానే ఉండాలి. అలా వారి బంధువర్గాన్నీ, ఇంటిల్లిపాదినీ శిక్షణనిచ్చి తీర్చగలరా! గృహ, కుటుంబ జీవనం కూడా అర్చకాదులకు గణనీయమైన అంశం.
హిందువుగా ఉండడానికి అర్చకత్వం లక్షణము, లక్ష్యము కాదు. గతంలో అర్చకులుగా కొనసాగిన వారు మాత్రమే హిందువులుగా బ్రతకడం లేదు. క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి, కాపు, వెలమ…ఇలా అన్ని వర్ణాల వారూ హిందువులుగానే ఉన్నారు. కానీ వారు అర్చకులు కాలేదు. కావాలని అనుకోలేదు. హిందుత్వాన్ని పాటిస్తున్నారు. సమానతకి, హిందువుగా జీవించడానికి అర్చకుడు కావడమే పరిష్కారం కాదు. తాను తన ఇంట్లో దేవుని పూజించుకున్నా హిందువే. ఆ అర్చన నేర్చుకున్నా చాలు. వారి ఇతర జీవన విధానం ఏమీ కఠిననియమాలతో మార్చుకోనక్కరలేదు. ప్రతి యిల్లూ ఆలయంగా చేసుకొనే భాగ్యం ప్రతి హిందువుకీ ఉంది. అన్ని వర్ణాల వారూ వారింట్లో దేవుడికంటూ ఒక గదినో, ఒక గూటినో కేటాయించుకుని పూజించుకోవచ్చు. ఆ అర్చనా విధానాలు ఇప్పుడు విరివిగా లభ్యమౌతున్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు. నామస్మరణ, భజన, స్తోత్రపారాయణ…అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి.

పైగా ఏవో కొన్ని పెద్ద మందిరాలలో తప్ప అనేకానేక ఆలయాల్లో ఉన్న అర్చకులకే గతిలేని మహా పేదరికం ఉంది. అలాంటి పేదరికంలోకి ఇంకొంతమందిని నెట్టడమే అవుతుందేమో ఆలోచించాలి.

ఏ హిందూ ఆధ్యాత్మిక సాధకుడైనా చిత్తశుద్ధితో కోరుకునేవి – పాపరాహిత్యము, యోగం, భక్తి, జ్ఞానం, మోక్షం…ఇవి మాత్రమే. కానీ పూజారిని కావాలని ఏ సాధకుడూ ప్రయత్నించడు. మన యోగులందరూ సిద్ధి పొంది, సాక్షాత్కారాన్ని పొందే హక్కు అన్ని కులాలవారికీ ఉంది.

ఒకప్పుడు దూరంగా ఉంచడం దోషమే. కానీ దానిని సవరించుకొని ఇప్పుడు ఆలయాల్లో, ఉద్యోగాల్లో కూడా స్థానాలు కల్పించింది హిందూ సమాజం.

అనేక వెనుకబడిన వాడల్లో భజన మందిరాలు, ప్రార్థనాలయాలు, ధ్యాన కేంద్రాలు ఏర్పరచవచ్చు. ఎక్కువ కఠిననియమాలు లేని దేవతా మందిరాలు ఏర్పరచి అందులో పూజాదికాలు వారిచేతనే నిర్వహింపజేసే పద్ధతులు కూడా ప్రోత్సాహకరాలే. 

అంతేకానీ కొన్ని ఆగమ సంప్రదాయాల ననుసరిస్తూ వస్తున్న ఆలయాల్లో మాత్రం వాటి పరంపరని అనుసరించవలసిందే. శాస్త్ర విరుద్ధంగా వాటిని మార్చరాదు.

ఆలయాల్లో దేవత అనుగ్రహానికి నోచుకున్న భక్తులు సిద్ధ పురుషులు – వీరంతా అర్చకులు కారు. పురందరదాసు, కనకదాసు, కురవనంబి, అన్నమయ్య, త్యాగయ్య, తులసీదాసు, సూరదాసు, కబీరు, నందనార్, మంగళకైశికి దాసరి, నాయనార్లు, ఆళ్వార్లు, స్త్రీలైన సక్కుబాయి, మీరాబాయి, మొల్ల, వెంగమాంబ, కారైక్కామ్మ, లవ్వయ్యారు…వీరంతా హిందూ జాతి నమస్కరించే ఆచార్య సమానులైన మహాత్ములు. కానీ వీరంతా ఆలయ అర్చకులు కారు.

హిందూధర్మ ప్రచారకులెందరో అర్చకులుగా లేరు. అందరూ సమానంగా హిందువులుగా జీవించడానికి అందరూ హిందూ మతాన్ని అనుసరిస్తే చాలు. అందరూ ఆలయాలను సందర్శించుకోవాలి. క్షేత్ర, తీర్థయాత్రలు చేయాలి. సద్గ్రంథాలు చదవాలి. హిందూ పెద్దలు అన్ని సామాజిక వర్గాల వారికీ ధర్మ, భక్తి, జ్ఞానాలను బోధించాలి, అనుసరింపజేయాలి. దూరం చేసిన వారిని దగ్గర చేయాలి. వారికి అనుసరించడానికి సాధ్యమైన హిందూ ధర్మాలు కోకొల్లలున్నాయి. వాటిని వారికి నేర్పాలి. అవి పరాయి మతాలకంటే గొప్పవి అనే సత్యాన్ని స్పష్టం చేయాలి.
ఇతరమతాలు వారి ప్రార్థనాలయాలకై, గ్రంథంపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి. కానీ హిందూధర్మంలో ఆలయం ప్రధానమే అయినా, ఆలయ ప్రసక్తి లేని కర్మ, భక్తి మార్గాలు చాలా ఉన్నాయి. అవి పాటిస్తూ అందరూ ఆలయాలను సేవించుకోవాలి. ఆలయాల్లో ఆర్చక స్థానంలో ఉన్నవారు సరిగ్గా నియమపాలన, ఆగమశాస్త్ర మర్యాదలు పాటిస్తున్నారో లేదో ధర్మ విషయజ్ఞులైన పెద్దల ద్వారా పరిశీలింపజేస్తూ పరీక్షింపజేయాలి.

మరొక్కమాట – “అర్చకాది వృత్తుల వారు సమాజంలో ఉత్పాదక(productive) వర్గానికి చెందినవారు కాదు. వారు అలసులు” అని ఇటీవల ఒక పెద్ద ప్రొఫెసర్ నానా వాకులు చెవాకులు పలికాడు. అతడే ఈ ‘అర్చకులు ఎందుకు కాకూడదు’ అనే నినాదాన్ని కదిపాడు.

తనవారికి అటువంటి productivity లేని శ్రమలేని వృత్తులలోనికి రానివ్వాలని, శ్రమ జీవులను ప్రేరేపించడం ఉచితం కాదు కదా!

ఏదేమైనా ఈ నిర్ణయాల సామంజస్యాన్ని కాలం నిర్ణయిస్తుంది. కానీ హిందువులలోని ఉన్నతవర్గాల వారు ఏకత్వాన్ని వీడకుండా, తమ సంప్రదాయాల లోతుల్ని గ్రహించి ఆనందంగా జీవించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here