
Bala Ganathi Temple
1. శ్రీ బాలగణపతి ఎవరు? ఆయన రూపం ఎలా ఉంటుంది?
వినాయకుని ముప్ఫైరెండు అవతారాలలో బాల గణపతి మొదటి అవతారం . ఈ అవతారం లో వినాయకుడు బాలుని రూపం లో దర్శనమిస్తాడు. ఆన్ని చోట్ల స్వామి పారాడే పసిపాపలా గజ ముఖం తో నాలుగు చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులలో తీపి పదార్థాలను పట్టుకుని తొండంతో వాటిని తింటున్నట్టుగా కొన్ని చోట్ల, మరి కొన్ని చోట్ల గజముఖం తో సింహాసనాధీశుడై చతుర్భుజునిగా కనిపిస్తాడు. ఒక చేతిలో మామిడి పండు, మరొక చేత పనస పండు, ఇంకొక చేతిలో చెరుకు గడలు మరొక చేత లడ్డూలు ధరించి ఉంటాడు.
బాల గణపతిని ధ్యానించడం వల్ల కలిగే లాభాలు
బాల గణపతి రూపం మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. దైవ స్వరూపాలైన పసిపిల్లలను చూస్తేనే మనం ఎంతో సంతోషిస్తాం మరి అటువంటిది దైవమే శిశు రూపం లో కనబడితే ఆ అద్వితీయమైన ఆనందాన్ని మాటలతో చెప్పడం అసాధ్యం. పిల్లల నక్షత్రాలకు అనుగుణంగా మంచి రోజు చూసుకుని బాల గణపతి హోమం చేయించడం వలన పిల్లల్లో బుద్ధి మాంద్యం తగ్గి చదువులోనూ, ఆట పాటలలోనూ, ఇతర విద్యాలలోనూ చురుగ్గా తయారవుతారు. మొండితనం, చెడు బుద్ధులు మాని మంచి సంస్కారాన్నీ నడవడికనూ పొందుతారు.
మహాబాల గణపతిని ఎలా ధ్యానించాలి?
శ్లో. కరస్థకదలీ చూత పనసేక్షుక మోదకమ్ |
బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || 1 ||
అనే శ్లోకాన్ని పిల్లలతో రోజుకు పదకొండు సార్లు చదివించడం శుభప్రదం.
బాల గణపతిని పూజించడం వలన పిల్లలు బుద్ధిమంతులు గా ఎదుగుతారు. మంచి అలవాట్లతో, చక్కని ఆరోగ్యం తో పెరుగుతారు. బాలారిష్టాలను బాపే బాల గణపతి పూజ పెద్దలకూ పిల్లలకూ కూడా అత్యంత శుభదాయకం.