
Kali Swarupini Kalika Devi
1. కాళికా దేవి ఎలా జన్మించింది
పార్వతీదేవి ఉగ్ర రూపమే కాళికా దేవి. ఈమె సృష్టి చైతన్యానికి రూపం. కాల స్వరూపం. కాలం ఎప్పుడూ గతిశీలమే. అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అది చైతన్యానికి ప్రతీక. ఆ చైతన్యమే కాళిక. అన్ని వర్ణాలనూ తనలో నింపుకున్న కాళ రాత్రి ఈమె వర్ణం.
దారుకుని వధించడానికి దుర్గాదేవి నుదుటినుండీ క్రోధజ్వాలయై కాళిక జన్మించిందని, రక్తబీజుడనే రాక్షసుని సంహరించడానికి భయంకర రూపిణియై అవతరించిందనీ, దేవి పురాణం, మార్కండేయ పురాణాలలోని కథలు చెబుతున్నాయి.
కాళికాదేవి ఉగ్రరూపానికి అర్థం
కాళికాదేవి నల్లని రూపం తమోగుణానికి ప్రతీక. ఒకచేతిలో ఆమె ఖండించిన అసురుని తల,ఖడ్గం, వరద అభయ హస్తాలతో ఉంటుంది. అమ్మ శ్మశానం లో నర్తిస్తుంది. కాలం అంటే వినాశం అనే అర్థం కూడా ఉంది. ఆ వినాశం అనివార్యమైనది. సృష్టించబడిన ప్రతి వస్తువూ నశించక తప్పదు. సృష్టించిన దాన్ని తిరిగి తనలోకి లయం చేసుకునే శక్తి కాళిక. ఆమె మహాకాలుని స్త్రీ రూపం. ఆమె మెడలోని పుర్రెలదండ దుష్టులను భయపెడుతుంది. ఆ దండలోని పుర్రెలు 22 బీజాక్షరాలకి ప్రతీకలని అంటారు.
అమ్మ ఆగ్రహాన్ని శాంతపరచడానికి మహా శివుడు చిదానందుడై అచేతన స్థితిలో ఆమె కాలికింద పడుకుని ఉంటాడు. స్వామి చర్యను చూసిన కాళిక అచ్చెరువుతో నాలుక తెరచి ఉంటుంది.
కాళికాదేవి రూపాలు ఎన్ని?
కాళికాదేవి దక్షిణ కాళి, వామ దేవి అనే రెండు ప్రధాన రూపాలు ఉన్నాయి. బృహన్నీలా తంత్రం ప్రకారం కాళికా దేవి రక్తవర్ణం తో సుందర రూపం లోనూ, కృష్ణ వర్ణం (నలుపు) తో భయంకర రూపం తోనూ ఉంటుంది. భద్రకాళీ రూపం భక్తులకు రక్షగా ఉంటుంది.
ఇవిమాత్రమే కాక అష్టవిధ కాళికా మూర్తులు అని ఎనిమిది మందిని చెబుతారు.
1. దక్షిణ కాళిక
2. సిద్ధ కాళిక
3. గుహ్య కాళిక
4. శ్రీ కాళిక
5. భద్ర కాళిక
6. చాముండా కాళిక
7. శ్మశాన కాళిక
8 .మహాకాళిక.
కాళికాదేవి ని పూజించడం వల్ల కలిగే శుభాలు
కాళికా దేవి విద్యాదాయిని. నీలకంఠుని మహాకవి కాళిదాసుగా అయినాడంటే అది అమ్మదయే. కాళికా దేవి మనలోని జాడ్యాలను భయాలను తొలగించి, చైతన్యాన్ని ఇస్తుంది. శత్రువులనుంచీ, దుష్ట పీడలనుంచీ కాపాడుతుంది. అఖండమైన విద్యాప్రాప్తిని ప్రసాదిస్తుంది.
I want kaala ratri ashtotaram in telugu