శబరిమలలో మహిళల ప్రవేశంపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ నెల 15 నుంచి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో శబరిమలకు వచ్చే భక్తులు కీర్తనలు పాడొద్దు.. శరణు ఘోష చేయవద్దని, గుంపులుగా వెళ్లొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో భక్తులకు ఇబ్బంది కలుగుతోందంటూ కొందరు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు నిన్న తీర్పునిచ్చింది.భక్తులు బృందాలుగా రావడం.. కీర్తనలు పాడటం తీర్థయాత్రలో భాగమని, వాటిపై పోలీసులు ఆంక్షలు విధించడం ఏమాత్రం సరికాదని, కఠినంగా వ్యవహరించవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. 144 సెక్షన్‌ను మాత్రం కొనసాగించాలని…ఆలయ పరిసరాల్లో శాంతి భద్రతలు కాపాడాలని హైకోర్టు సూచించింది. భక్తులపై ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదని పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. తాము సాధారణ భక్తుల జోలికి వెళ్లడం లేదని…గుంపులు గుంపులుగా వెళుతున్న ఆందోళనకారులను మాత్రమే అడ్డుకుంటున్నామని రాష్ట్ర పోలీస్ చీఫ్ కోర్టుకు వెల్లడించారు.







