
సాయి బోధ / Sai Baba Bodha
సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.
5. గురు శిష్యుల అపారమైన ప్రేమ
బాబా ఈ విధంగా చెబుతున్నారు..
“నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచిపోషించిరి. భోజనమునకు గాని వస్త్రమునకుగాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారమని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేనెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించెడివారు. ఆ విధమైన గురువే యుండరు. నిరంతర ధ్యానములో నున్న వారిని తదేకముగ జూచుచుండెడి వాడను. మేమిద్దర మానందములో మునిగెడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారిపై దృష్టినిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకోటి లేకుండెను. వారేనాయాశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడు వారియందే నాటుకొని యుండెడిది. ఇదియే వారడిగిన దక్షిణలో ఒక పైస. ’సబూరి’(సంతోష స్థైర్యములలో గూడిన ఓరిమి) యనునది రెండవ పైసా. నేను మిక్కిలి సంతోషముతో చాలకాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని.
ఈ ప్రపంచమనే సాగరమును ’సబూరి’ యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి యనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటిని తొలిగించును; కష్టములను పారద్రోలును. అనేక విధముల అవాంతరములను తొలిగించి, భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగుజేయును. సబూరి యనునది సుగుణములకు గని, మంచి యాలోచనకు తోడుపంటిది. నిష్ఠ, సబూరి అనునవి అన్యోన్యమైన అక్కచెల్లెండ్ర వంటివి.