
సాయి బోధ / Sai Baba Bodha
సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.
3. బాబా కథ
బాబా ఈ క్రింది విధముగా బోధించెను:
“ఓ తల్లీ! అనవసరమైన యాతన కేల పాల్పడి చావును కోరుచున్నవు? నీవు నిజముగా నా తల్లివి; నేను నీ బిడ్డను. నాయందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము! నీకు నా వృతాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా వినినచో నీకది మేలు చేయును. నాకొక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు; మిక్కిలి దయార్ద్రహృదయులు. వారికి చాల కాలము శుశ్రూష చేసితిని. కాని నా చెవిలో వారేమంత్రము నూదలేదు. నాకు వారిని వదలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని.