
3. ఆలయ చరిత్ర..
ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండల కేంద్రం లో ఉన్న ఈ లక్ష్మీ నర్సింహ స్వామి ఆలయాన్ని క్రీ||శ|| 11, 13వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. శాతవాహన వంశ తొలిరాజులైన జైన మతస్తులు శ్రీ ముఖ శాత వాహనులు కోటి లింగాల ప్రాంతాన్ని గణ . తంత్ర రాజ్యంగా పాలిస్తూ సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాన్నంతటినీ స్వాధీనపరుచుకొని మహారాష్ట్ర ప్రాంతాన్ని సైతం జయించాడు. జైనమతానికి చెందిన రాజు కావడంతో జైనులకు సంబంధించిన ఆలయాన్ని నిర్మించడంలో ఈ ప్రాంతం క్రమేణా జైనథగా మారిపోయిందని చరిత్ర చెబుతోంది. కొందరు ఇది పల్లవుల కాలం నాటి ఆలయం అని భావిస్తున్నారు. కాని వాటికి ఆధారాలేమీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ ప్రాంతం శాతవాహనుల కాలంలో జైనమత కేంద్రంగా వర్ధిల్లింది. ఇక్కడ లభించిన శిలా శాసనాల పై దేవ నాగర లిపితో చెక్కబడి ఉన్న శాసనాలు దర్శనం ఇస్తాయి. ఈ శాసనాల్లో సూర్య భగవానున్ని స్మరించే శ్లోకాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్య దేవాలయంగా కూడా పిలుస్తున్నారు. కాని వేద పండితులు మాత్రం సూర్యునిచే ఆరాధింపబడే నారాయణుని ఆలయంగా భావిస్తున్నారు. ఈ ఆలయానికి వాడిన రాయి మహారాష్ట్ర సమీపంలోని పాండ్ర కవడ నుంచి తెచ్చినట్లుగా భావిస్తున్నారు. ఆలయం ముందు భాగంలో 20 ఎకరాల విస్తీర్ణంలో జలాశయం ఉంది. ప్రస్తుతం ఈ జలాశయం కొంత నిరాదరణకు గురైంది. ప్రతి యేటా సెప్టెంబర్, అక్టోబర్, మార్చి, ఏప్రిల్ నెలల్లో సూర్యుని కిరణాలు లక్ష్మీ నారాయణ స్వామి విగ్రహం పాదాలను తాకుతున్నట్లు ఉదయిస్తాయని ఈ కిరణ ప్రసారాన్ని వీక్షిస్తే సకల శుభాలు కలుగుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. జలాశయం మధ్యలో డోలారోహణ మండపం ఉంది. ఈ మండపాన్ని చేరేందుకు గతంలోనైతే వారధి వంటి నిర్మాణం ఉండేదని స్థానికులు చెబుతుంటారు. ప్రస్తుతం ఆ వారధి కనుమరుగు అయింది.