
2. జైనథ్ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం
అతిపురాతన ఆలయాల్లో ఒకటిగా జైనథ్ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం వెలుగొందుతున్నది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం ఉంది. ఎంతో మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి వారి కోరికలను తీర్చుకున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం మారుమూల ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్లో ఒకటి కాగా, శ్రీశైలంలో మరో ఆలయం ఉందని వేదాంతులు చెబుతుంటారు. శ్రీశైలంలో ఉంది సూర్య దేవాలయం కాగా ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్లో ఉన్న దేవాలయం సూర్యునిచే పూజింపబడుతున్న నారాయణుని ఆలయం అని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ఎంతో ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని రాష్ట్రవ్యాప్తంగా కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడ అనేక మంది భక్తులతో పాటు ప్రముఖులు కూడా సందర్శించి పునీతులు అయ్యారు. జిల్లాలోని అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి. ఉన్నత శిఖరం కలిగి అద్బుతమైన శిల్ప కళా సంపదతో ఉట్టిపడే ఈ ఆలయం జిల్లాలోనే ప్రసిద్ది చెందింది. 60 చదరపు గజాల ఎత్తు, 40 చదరపు గజాల వైశాల్యంతో అష్టకోణాక మండపంతో ఉన్న ఈ ఆలయం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 17 కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉంది.