మెడ నొప్పికి దూరంగా..? | Neck Pain Remedies in Telugu..?

0
2416
Neck Pain remedies
మెడ నొప్పికి దూరంగా..? | Neck Pain Remedies in Telugu..?

మెడ మన తల బరువును మోస్తుంది. తల అటూ ఇటూ హాయిగా తిరగటానికి తోడ్పడుతుంది . భుజం కండరాలకు దన్నుగా ఉంటూ.. సాఫీగా కదలటానికి దోహదం చేస్తుంది.

అందుకే మెడకు చిన్న సమస్య వచ్చినా ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మెడ నొప్పి రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది.

నిజానికి మెడ నొప్పి అనేది రాత్రికి రాత్రి వచ్చేదేమీ కాదు. చాలాకాలం నుంచి క్రమంగా గూడు కట్టుకుంటూ వస్తుంది.
అయితే వయసు మీద పడుతున్నకొద్దీ ఎముకలు లేదా వెన్నుపూసల మధ్య ఉండే డిస్కులు క్షీణించటం..

కండరాలు బలహీనం కావటం.. సరిగా కూచోకపోవటం.. ఒత్తిడి.. నిద్రలేమి వంటివి మెడ నొప్పి ఉన్నట్టుండి ఉద్ధృతమయ్యేలా చేస్తాయి.

ఇలాంటి సమయాల్లో చాలామంది ఏదో ఒక మాత్ర వేసుకొని నొప్పి తగ్గగానే మరచిపోతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మెడనొప్పికి దూరంగా ఉండొచ్చు.

* అదే పనిగా గంటల తరబడి ఒకేలా కూచోవద్దు. మధ్యమధ్యలో లేచి, కాసేపు అటూ ఇటూ నడవాలి. దీంతో మెడ
భంగిమ తిరిగి గాడినపడుతుంది. మెడపై ఒత్తిడీ తగ్గుతుంది.

* కంప్యూటర్ల ముందు కూచొని పనిచేసేవాళ్లు కుర్చీ ఎత్తు సరిచేసుకోవాలి. మానిటర్‌ మన కళ్లకు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.

దీంతో మెడను మరీ పైకెత్తటం, కిందికి దించటం తగ్గుతుంది. మొబైల్‌ ఫోన్లతో ఎక్కువసేపు మాట్లాడేవారు బ్లూటూత్‌ లేదా హెడ్‌సెట్‌ వాడుకోవాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ మెడకు, భుజానికి మధ్య ఫోన్‌ పెట్టుకొని మాట్లాడొద్దు. ఇక ల్యాప్‌టాప్‌, ట్యాబెట్లను నేరుగా ఒళ్లొ కాకుండా దిండు వేసుకొని దానిపై పెట్టుకోవాలి. దీంతో మెడ పూర్తిగా కిందికి వాలకుండా చూసుకోవచ్చు.

* కళ్లద్దాలు ధరించేవారు ఎప్పటికప్పుడు కంటి పరీక్ష చేసుకుంటూ సరైన కళ్లద్దాలనే వాడాలి. దీంతో తలను వెనక్కి వాల్చి లేదా మెడను ముందుకు చాచి చూడటం తగ్గుతుంది. లేకపోతే మెడపై అనవసర ఒత్తిడి పడుతుంది.

* పడుకునేప్పుడు మరీ ఎత్తయిన దిండ్లు వేసుకోవద్దు. అలా చేస్తే మెడపై తీవ్రమైన ఒత్తిడి పడి, తల కదలికలు దెబ్బతింటాయి.

* పెద్ద బరువు గల వస్తువులను కదిలించేటప్పుడు , ఎత్తేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శక్తికి మించి బరువులను ఎత్తినా, కదిలించినా మెడ, వీపు మీద భారం పడుతుంది.

* నిద్ర సమస్యల మూలంగా ఎముకలను అంటుకొని ఉండే కండరాల నొప్పి కూడా తలెత్తొచ్చు. కాబట్టి రాత్రిపూట కంటి నిండా నిద్రపోవాలి.

* నిపుణుల సలహా మేరకు మెడ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయాలి. వీటితో మెడ వద్ద ఉండే వెన్నుపూసలు కూడా పరిపుష్టమవుతాయి.

– సాధారణంగా మెడ నొప్పి గురించి పెద్దగా చింతించాల్సిన పనిలేదు. కానీ నొప్పి భుజాలకు, చేతులకు వ్యాపిస్తుంటే.. ఒక చేయి లేదా కాలు మొద్దుబారుతుంటే, బలహీనంగా అనిపిస్తుంటే మాత్రం తాత్సారం చేయరాదు. అలాగే నొప్పితో పాటు జ్వరం ఉన్నా, బరువు తగ్గుతున్నా, వాంతులవుతున్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here