
Direction of God Idols / images
1. దేవతా విగ్రహాలు/పటాలు ఇంట్లో ఎప్పుడు అమర్చాలి?
ఇంట్లోకి చేరినప్పుడు కొంతమంది సామాను మొత్తం సర్దుకున్న తరువాత దేవతా విగ్రహాలను అమర్చుకుంటారు. ఎక్కడ ఖాళీ చోటు ఉంటే అక్కడ దేవతా విగ్రహాలను ఉంచుతారు.
ఖాళీగా ఉన్న గూళ్ళలో లేదా షెల్ఫ్ ల పైన పెడుతుంటారు. నిజానికి దేవతా విగ్రహాలను సరైన దిశలో సరైన ప్రాంతం లో అమర్చిన తరువాతే మిగిలిన సామాను సర్దుకోవాలి.
అందుకే ఇంట్లోకి చేరే ముందు మొదటగా దేవతా విగ్రహాలను లోపలికి తెచ్చే సంస్కృతి పాటించబడుతుంది.
వాస్తు ప్రకారం ఇంట్లో దేవతా విగ్రహాలు/పటాలు ఏ దిక్కున ఉండాలి?
వాస్తుప్రకారం పూజగది లో, లేదా ఇంట్లో దేవతా విగ్రహాలు తూర్పువైపున అమర్చాలి. అంటే దేవతలు పశ్చిమాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి.
అప్పుడు పూజ చేసేటప్పుడు మనం తూర్పు ముఖంగా కూర్చుంటాము. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత చేకూరుతుంది. దేవుళ్ళను ఈశాన్యం లో (north east) ఉంచడం అత్యంత శుభదాయకం.
ఏ విగ్రహం/పటం ఎటువైపు ఉండాలి?
దేవతా విగ్రహాలకు ప్రత్యేకమైన గుణం ఉంటుంది. దాన్ని బట్టి ఏ విగ్రహం లేదా ప్రతిమ ఏ దిక్కున ఉంచాలో నిర్ణయించబడింది.
- పడమటి ముఖంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సూర్యుడు, ఇంద్రుడు, కుమారస్వామి ఉండాలి. శివలింగం ఉత్తరం వైపుగా ఉండాలి.
- నైరుతి ముఖంగా (south west facing) హనుమంతుడు ఉండాలి.
- దక్షిణాభిముఖంగా వినాయక, కుబేర, భైరవులు, దుర్గా దేవీ ఉండాలి. షోడశ మాతృకలు కూడా దక్షిణాభిముఖంగానే ఉండాలి.
- తూర్పు అభ్యున్నతికీ, చైతన్యానికీ, శుభ ప్రారంభానికీ చిహ్నం. పడమటి ముఖంగా ఉన్న దేవతలు సృష్టికి మూలమైన వారు.
పూజామందిరం లోని విగ్రహాలు ఏ స్థానాలలో ఉండాలి?
ఆది పూజలందుకునే వినాయకుని విగ్రహం మధ్యలో ఉండాలి. ఆయనకి కుడివైపున కులదేవతా విగ్రహాలు, ఇతర దేవుళ్ళ విగ్రహాలూ ఉండాలి. అంటే హనుమంతుడు,కుమారస్వామి మొదలైన వారు. అమ్మవారి విగ్రహాలు వినాయకునికి ఎడమవైపున ఉండాలి.
కొన్ని పటాలలో/ విగ్రహాలలో సీతారాములు, లక్ష్మీ నారాయణులు, పార్వతీపరమేశ్వరులు ఉంటారు. వాటిలో అమ్మవారు స్వామివారికి ఎడమవైపున ఉన్నట్టయితే అటువంటి పటాలను వినాయకునికి కుడివైపున ఉంచాలి. ఎడమవైపు చంద్రనాడి అంటారు. ఎడమవైపున ఉన్న అమ్మవారు స్వామికి సహాయకారిగా ఉంటుంది అక్కడ స్వామి ప్రధాన దేవత. అందుకని అటువంటి పటాలను స్వామివార్లు ఉండే కుడివైపునే ఉంచాలి.
కొన్ని పటాలలో అమ్మవారు స్వామివారికి కుడివైపున ఉంటుంది. కుడివైపు సూర్యనాడి అంటారు. ఇటువంటి పటాలలో స్వామివారు అమ్మవారికి సహాకారి గా ఉంటాడు. కనుక ఈ పటాలను అమ్మవార్ల పటాల వైపుగా అంటే మధ్యలో ఉన్న వినాయకునికి ఎడమ వైపుగా అమర్చాలి.
దేవతా విగ్రహాలు ఎటువైపు ఉండకూడదు?
ఇంట్లోని దేవతా విగ్రహాలు దక్షిణం వైపు ఉండకూడదు. దక్షిణం వైపు దేవతా విగ్రహాలు దుష్ట శక్తులకు ప్రీతికరమైనవి. వామాచారాన్ని, క్షుద్ర పూజలని చేసేవారు పిశాచాలను ఆవాహన చేసేవారు, దక్షిణం వైపుగా దేవతా విగ్రహాలను ఉంచుతారు. కనుక ఎట్టి పరిస్థితులలోనూ దక్షిణం వైపుగా ఇంట్లోని దేవతా విగ్రహాలను ఉంచరాదు.ఆగ్నేయం లో హనుమంతుని ప్రతిమ ఉండకూడదు.
వాస్తు ప్రకారం – గృహాలంకరణ | Home According to Vasthu in Telugu