కన్యాదానము – ఫలితాలు | Kanya Dhanam Significance in Telugu
అన్ని దానాలలోకి కన్యాదానం చాలా గొప్పది . అందునా ఈ క్రతువుని మనకి శాస్త్రం ఎలా చెప్పిందో అలా ఆచరిస్తే ఆ ఫలితాలను మనము అంచనా వేయలేము.
ఏదైనా దానం చేసేటప్పుడు ‘తుభ్యమహం సంప్రదదేనమః‘ అని పలుకుతూ దానిమిస్తాము. అంటే, నేను దీన్ని నీకు ఇచ్చేస్తున్నాను. ఈ క్షణం నుండి దీనిపై అధికారాన్ని కోల్పోతున్నాను. ఇక ఇది నాది కాదు.
కాని, కన్యని దానం చేసేటప్పుడు చతుర్ధీవిభక్తి అయినటువంటి ‘సంప్రదదేనమః‘ అన్న దానిని వాడకుండా ‘తుభ్యం ప్రజాసహత్వ ధర్మభ్యః ప్రతిపాదయామి‘ అని కన్యాదాత అంటే, ఓం స్వస్తి అని వరుడు స్వీకరిస్తాడు.
మనం కన్యాదానానికి అర్ధాన్ని లోతుగా పరిశీలిస్తే కన్య+దానము కాదు. కన్య+అదానం అని అర్ధం. కన్యని తెచ్చుకోవడము అని అర్ధం.
ఎక్కడ చూసినా కన్యదే అగ్రస్థానంగా కనిపిస్తుంది. వధువుని తూర్పు ముఖంగా కూర్చుండబెట్టి వరుడిని పడమర ముఖంగా కూర్చోబెడతారు.
ఈ కన్యాదానం అనే తంతు ముగిసాక మళ్ళీ తూర్పు ముఖంగా కూర్చోవడానికి వరుడే రావాలి తప్ప, కన్యని కదపరు.
శ్రీమద్రామాయణంలో రాముడు గాని, మహాహాభారతంలో పాండవులు కాని, శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు గాని తాము వెళ్లి కన్యని అదానము (అబ్బాయిలు వెళ్లి కన్యని తెచ్చుకోవడం) చేసుకున్నారు గాని భార్యలచేత ఏ భర్తలూ తీసుకొని పోబడలేదు.
కన్యాదాన ఫలితాలను చూస్తే మనకి కళ్ళు గిర్రున తిరుగుతాయి (శాస్త్రోక్తంగా జరిగిన కన్యాదానానికి మాత్రమే ఈ ఫలితం).
గంగానదిలోని ఇసుక రేణువులని సప్తర్షి మండలం వరకు గుట్టగా పోసి, ఒక్కొక్క ఇసుక రేణువునీ తీస్తుంటే, మొత్తం రాశి తరిగిపోవడానికి ఎంత కాలం పడుతుందో, అంత కాలం బ్రహ్మలోకంలో కన్యాదాత ఉంటాడు.
అదే విధంగా యవధాన్యపు గింజలతో గ్రహమండలం వరకు కాని, నువ్వులతో సూర్యమండలం వరుకు పోసి కాని, అవి సంపూర్ణంగా పై విధంగానే తరిగిపోయే వరకూ బ్రహ్మలోకంలో నిత్యంగా ఉంటాడట కన్యాదాత. అలాగే
కపిల గోవు యొక్క రోమాలని లేఖ్ఖపెట్టడం ఎంత సమయం పడుతుందో, అంత కాలం కన్యాదాత బ్రహ్మలోకంలో ఉంటాడట.
అంటే అంతకాలం ఉంటాడని చెప్పడం దీని భావం. కన్యాదానం వల్ల, కన్యవల్ల తండ్రి వైపు పది మరియు తల్లి వైపు పది తరాలవారు ముందూ, వెనుక నరకం నుండి దాటి బ్రహ్మలోకంలో నిత్య నివాసంగా ఉంటారని కూడా కన్యాదాన మంత్రాలు చెబుతున్నాయి.
ఇది నిజమేనా? సింగినాదం, జీలకర్ర అనుకోకూడదు. మహర్షులకి అసత్యమాడవలసిన అవసరం ఏమాత్రము లేదు. లోకంలో అన్ని ఫలితాలని ప్రత్యక్షంగా చూపించలేము.
పిల్లవాడిని కళ్ళెర్ర చేసి చూడగానే వాడు ఏడుస్తున్నాడా లేదా? ఏ ఆయుధం వెళ్లి వాణ్ని బాధించింది. కనిపించనిదేదో ఫలితాన్ని ఇచ్చింది కదా!
ఈ ఫలితాలన్నింటినీ మనము ఎప్పుడు పొందుతాము అంటే కన్యాదానం సక్రమంగా జరిగితేనే. ఈ విషయాన్ని కన్యాదాత గ్రహించాలి.
కళ్యాణవేదిక మీద కుర్చీలు వేయకూడదు. ముసలివారు, కాళ్ళ చెప్పులు ఉన్నవాళ్లు, పెద్దవాళ్ళు. అభిమానం, ప్రేమ ఉండవచ్చు గాక, కాని ఆ అభిమానం, ప్రేమ ఆ జంట యొక్క అన్యోన్యతకి కాని, అభ్యున్నతికి కాని ఆటంకం కాకూడదు కదా!
ప్రతి కన్యాదాత ముందుగానే వరుడి తండ్రికి చెప్పుకోవాలి. కళ్యాణవేదిక మీద కుర్చీలు వేయకూడదు అని, ఆ జంట అభ్యున్నతి కోసం, అంటే వరుడి తండ్రి కాదనకూడదు. అలాగే ఈ నురగలు కొట్టడం, టపాకాయలు కాల్చడం లాంటివి చేయకూడదు.
ఇవన్నీ కూడా మనం వేడుక అనుకుంటాము కాని అవి చాలా దోషభూయిష్టాలు.
కాబట్టి, ప్రతి కన్యాదాత కూడా తాను ఎంతో అల్లారుముద్దుగా పెంచిన కూతురికి వివాహం చేసేటప్పుడు కన్యాదాన సమయంలో ఎంతో గర్వంగా, నేను నా కూతురికి కన్యాదానం చేస్తున్నాను అని కన్యాదానం చేయబోయే ముందు ఆనందంగా ఉన్న తన కన్న కూతురి ముఖాన్ని చూసి తాను ఈ వివాహం ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ఎంత కష్టపడ్డానో అని మర్చిపోతాడు.
అలాగే అప్పగింతల సమయంలో విలపించని తండ్రి ఉండడు. ఒకవేళ అందరిముందు కాకపోయినా పక్కకి తిరిగి ప్రతి కన్న తండ్రి తన ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకుంటాడు.
మనము కన్యాదానం సమయంలో కన్యకి వడ్డాణం పెట్టాలని పోయిన సారి వ్యాసంలో తెలుసుకున్నాము. వడ్డాణం ఎందకు పెట్టాలి అని మనము ఆలోచిస్తే నడుమునుండి పైకి ఉన్న శరీరం అంత దేవతా శరీరం.
నడుము నుండి క్రిందకి ఉన్న శరీరం అంతా రాక్షస శరీరం. ఈ రెండింటిని విడగొట్టబడేది నడుము. ఇది తెలియచెయ్యడం కోసం వడ్డాణం పెడతాము. అలాగే వడ్డాణం నాభి స్థానాన్ని కూడా కప్పి ఉంచుతుంది. అసలు మనము వివాహం చేస్తున్నదే ధర్మబద్ధమైన సంతానం కోసం.
మరి తల్లి గర్భంలో శిశువు ఉండగా పోషణ అంతా జరిగేది నాభి ద్వారానే కదా. అందుకనే ఆ నాభి స్థానాన్ని కప్పి ఉంచుతూ సువర్ణ ఆభరణం పెడతారు. అది పెట్టకపోయినా కొబ్బరి బొండాం, గంధపు చెక్క, మంచి గుమ్మడి పండు అమ్మాయి చేతిలో పెట్టి దానం చేస్తే మనం సాలంక్రుతకన్యాదానం చేసినట్లే.
ఇప్పుడు మనం కొబ్బరిబోండాంని కూడా వివిధ రకాలుగా అలంకరించడం చూస్తూ ఉన్నాము. దాన్ని అలా అలంకరించకూడదు. ఆ కొబ్బరిబొండాం సాక్షాత్ ఆది దంపతులు కాబట్టి దాని మీద పిన్నులతో గుచ్చడం చెయ్యకూడదు.
ఇంత పవిత్రమైన, విశిష్టమైన మన వివాహవ్యవస్థని, మన సనాతన ధర్మాన్ని ముందుతరాలకి కూడా ఇంతే పదిలంగా అందచేయడంలో ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలని కోరుకుంటూ...
సర్వేజనా సుఖినోభవంతు
జొన్నలగడ్డ జ్యోతి